Hyderabad doctor Ahmed Mohiuddin Syed arrested : సాటి మనిషి మీద ప్రేమ కలిగి ఉండాలి. కష్టకాలంలో దయను చూపించాలి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలి. కానీ ఇవేవీ వారికి లేవు. పైగా డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఇదంతా కూడా వారు చేసింది సమాజసేవ కోసం కాదు. ఉగ్రవాదం కోసం. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఒక ముక్కలో చెప్పాలంటే వారంతా కూడా డాక్టర్ల రూపంలో ఉన్న ఉగ్రవాదులు. దేశంలో దారుణమైన ఘటనలకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో వారు చదువుకున్న చదువును సమాజ హితం కోసం.. రోగులకు సాంత్వన కోసం ఉపయోగించకుండా సాటి మనుషులను అంతం చేయడానికి వాడేందుకు ప్రయత్నించారు.
ఉగ్రవాద నిరోధక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్లలో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. వీరంతా కూడా డాక్టర్లే. అయితే దర్యాప్తు బృందాలు లోతుగా ఈ విషయాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి దేశంలో దారుణానికి రూపకల్పన చేసింది హైదరాబాద్ నగరానికి చెందిన 35 సంవత్సరాల డాక్టర్ అహ్మద్ మొహియుద్దిన్ సయ్యద్. ఇతడు ఏకంగా దేశంలో సామూహిక హత్యల కోసం సైనేడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన రైసిన్ ను తయారు చేశాడు. ఎప్పుడైతే గుజరాత్ యాంటి టెర్రర్ స్క్వాడ్ సయ్యద్ ను అరెస్ట్ చేసిందో.. ఆ తర్వాత అతని ప్రధాన అనుచరులు కూడా దొరికిపోయారు. దీంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దేశంలో ఉన్న భద్రత వ్యవస్థలు మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి..
సయ్యద్ ఆముదపు గింజలతో తయారుచేసిన విషం కేవలం 0.2 మిల్లీగ్రాములు మనిషిని సెకండ్ల వ్యవధిలోనే చంపేస్తుంది. సైనేడ్ కు యాంటీ డోస్ ఉంటుంది. కానీ దీనికి ఎటువంటి యాంటీ డోస్ ఉండదు. బయో ఉగ్రవాదం చేయాలని డాక్టర్ ఏకంగా ఆన్లైన్లో అనేక విధాలుగా పరిశోధనలు చేశాడు. ల్యాబ్ ఏర్పాటు చేసుకొని రైసిన్ తయారీ మొదలుపెట్టాడు. ఇక సయ్యద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము చెందిన యువకులు ఆజాద్ సులేమాన్ షేక్, సుహేల్ అనే వ్యక్తులతో కలిసి ఐసిస్ కోరసాన్ ముఠాలో చేర్చాడు. ఆముదపు నూనె నుంచి రైసిన్ విషాన్ని తయారు చేశాడు. ఇతడికి పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ ద్వారా గ్లాక్, బెరెట్టా పిస్టల్స్, ఇతర పదార్థాలు వచ్చాయి. వాటి ద్వారా అతడు ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలలో మాస్ పాయిజన్ చేసి.. గుంపులు గుంపులుగా జనాలను చంపాలని చూశాడు.
ఇతడు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాద గ్రూప్ “అబు ఖదేజా” తో టెలిగ్రామ్ రియల్ టైం చాట్ ద్వారా టచ్ లో ఉండేవాడు. ఫండ్స్, రిక్రూట్మెంట్ జరుపుతూ ఉండేవాడు. పాక్ ఉగ్రవాద సంస్థలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఇక గుజరాత్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో మూడు ఫోన్లు, రెండు లాప్టాప్ లు, ఎన్క్రిప్టెడ్ చార్ట్స్, మ్యాపులు, కెమికల్ రెసిపీస్ డాటా స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఉగ్రవాదులను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. వారికి జీవితంలో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అరెస్టు అయిన ముగ్గురిపై ఉపా, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టారు.