Delhi Blast Red Fort Explosion ఢిల్లీలో ప్రస్తుతం వాతావరణం చలిగా ఉంది. పైగా ఇక్కడ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండడంతో.. ప్రతిరోజు దీని గురించే అక్కడ చర్చ జరుగుతోంది. కాలుష్యం మినహా మిగతా వ్యవహారాలు ఢిల్లీలో సాఫీగానే సాగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ రాజధానిలో ఒక్కసారిగా ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఎవరూ అంచనా వేరని దారుణం జరిగింది.. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సంభవించిన పేలుడు పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ పేలుడులో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక డెలివరీ బాయ్ శరీరం మొత్తం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఓ కారును నిలిపి ఉంచారు.. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.. ఆ తర్వాత మంటలు అమాంతం ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న వాహనాలకు అంటుకున్నాయి. చూస్తుండగానే ఆ ప్రాంతం మొత్తం అత్యంత భయానకంగా మారిపోయింది.. 8 మంది చనిపోవడం.. 20 మంది గాయపడడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చారు.. 7 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించాయి. గంటల తరబడి శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.. గాయపడిన వారిని లోక నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తో మాట్లాడారు. ఈ పేలుడు వల్ల 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం బృందాలు ఘటన స్థలానికి వచ్చాయి. బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాలను అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.
సోమవారం సాయంత్రం 6:55 నిమిషాల ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే అగ్ని మాపక శాఖకు కొంతమంది ఫోన్ చేశారు. వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు కూడా క్షేత్రస్థాయికి వచ్చారు… దేశ రాజధానిలో పేలుడు జరిగిన తర్వాత.. కేంద్ర హోం శాఖ వెంటనే అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ పేలుడు తర్వాత సమీపంలో ఉన్న సిసి కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది.. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది..