
తెలంగాణ రాజకీయాల్లో ఊహకందని ఎత్తులు వేయడంలో సీఎం కేసీఆర్ ను మించిన ఘనుడు లేడని మరోసారి రుజువైంది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేడని తలపట్టుకుంటున్న వేళ.. గట్టి అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ ను ఢీకొట్టేందుకు ఎవరిని దించుతున్నారో కేసీఆర్ చెప్పకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి వ్యవహారం బెడిసి కొట్టడంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థిగా ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ రంగంలోకి దించబోతున్నట్టు తెలిసింది. తాజాగా ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 6 ఏళ్లు సర్వీస్ ఉండగానే రాజీనామా చేయడం రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.
సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో స్కెచ్ గీశారని.. అక్కడి దళితుల ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాటిని కొల్లగొట్టేందుకు.. బలమైన నెట్ వర్క్ ఉండడంతో ఈయననే హుజూరాబాద్ లో పోటీ దించడానికి కేసీఆర్ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.
https://twitter.com/RSPraveenSwaero/status/1417077229809389572
గురుకులాలను తెలంగాణలో అభివృద్ధి చేసిన చరిత్ర ప్రవీణ్ కుమార్ సొంతం. వాటిని ప్రక్షాళన చేసి ఓ పట్టాలెక్కించి అభివృద్ధి చేశారు. ఇప్పుడవి సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ఇక పోలీస్ గానూ ఈయన తనదైన ముద్ర వేశారు. మావోయిస్టులను అరికట్టడం నుంచి అభివృద్ధి వరకూ చాలా మంచి పనులు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ సేవానిరతిని చూసి సీఎం కేసీఆర్ ఈయనను హూజూరాబాద్ అభ్యర్థిగా దించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రవీణ్ కుమార్ కు సైతం సామాజికసేవ అంటే ఇష్టం కావడంతో దీనికి ఓకే చెప్పి రాజీనామా చేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఒక వేళ హుజూరాబాద్ లో ఈటలను కనుక ప్రవీణ్ కుమార్ ఓడించి టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈయనను మంత్రిని చేస్తారని.. విద్యాశాఖను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
