Peddi Sudarshan Reddy: భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయన ప్రాణాపాస్థితిలో ఉన్నారు. అనేక పర్యాయాలు సిపిఆర్ చేసిన తర్వాత ఆయనను హైదరాబాద్ తరలించారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు అత్యాధునిక పరికరాల ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆయనను పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలాగైనా బతకాలని యశోద యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఎంత ఖర్చయినా సరే భారత రాష్ట్ర సమితి భరిస్తుందని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. పైగా ఆయన ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ తీసుకోరు. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అటువంటి సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా గుండెపోటుకు గురికావడం భారత రాష్ట్ర సమితి నాయకులను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పెద్ది ఇలా ఒకసారిగా అనారోగ్యానికి గురికావడం కలకలం రేపుతోంది. సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురి కావడం యాదృచ్చికమా.. తెర వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి గుండెపోటు వెనక అసలైన కారణాన్ని భారత రాష్ట్ర సమితి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయట పెట్టారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లి. 19 సంవత్సరాల వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. నల్లబెల్లి మండలానికి జెడ్పిటిసిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014లో దొంతి మాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018లో గులాబీ పార్టీ తరఫున గెలిచారు. 2014లో ఓడిపోయినప్పుడు కేసీఆర్ సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. 2023 ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు.
సుదర్శన్ రెడ్డి మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ఈయనకు బలమైన కేడర్ ఉంది. అయితే ఒక్కసారిగా ఇలా గుండెపోటుకు గురికావడం వెనుక ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు పహిం ఖురేషి అని భారత రాష్ట్ర సమితి కీలక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
“కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంటుందో.. సుదర్శన్ రెడ్డికి ఎదురైన ఉదంతం ఒక ఉదాహరణ. నర్సంపేటలో కొంతమంది వ్యాపారస్తులు వాసవి బిల్డర్స్ అనే కంపెనీకి కొంత భూమి అమ్మేశారు. ఆ భూమి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఖురేషి కన్ను పడింది. వాసవి బిల్డర్స్ అధినేత విజయ్ కుమార్.. ఖురేషి కలిసి సైబరాబాద్ లోని ఈవో డబ్ల్యూ లో కేసు పెట్టారు. నర్సంపేట లో సుదర్శన్ రెడ్డికి సన్నిహితులైన వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయనను నిందితుడిగా చేర్చాలని ప్రణాళిక రూపొందించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని” ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సన్నిహితుడి పేరు ప్రముఖంగా చెప్పడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం కూడా వాకబు చేస్తోంది. ఇటీవల సుదర్శన్ రెడ్డిని హనుమకొండ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నప్పుడు.. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. సుదర్శన్ రెడ్డికి సత్వరమే వైద్యం అందేలాగా చర్యలు తీసుకుంది. మరి ఇప్పుడు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.