Bonalu Festival : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ప్రతీ ఆషాఢ మాంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. దాదాపు నాలుగు వారాల పాటు ప్రతీ ఆదివారం ప్రజలు ఈ ఉత్సవాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగలో ‘రంగం’ కీలకంగా ఉంటుంది. ఈ రంగం కోసం వేలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. సాక్షాత్తూ అమ్మవారు మాతంగిలో ప్రవేశించి భవిష్యవాణిని వినిపిస్తారని భక్తుల నమ్మకం. అసలు ఈ రంగం ప్రత్యేకత ఏమిటీ? రంగం నిర్వహించడానికి కారణం ఏంటీ?
‘రంగం’ అనేది అమ్మవారి దైవవాణిని భక్తులకు తెలియజేసే ఆచారం. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, బోనాల సమర్పణ అనంతరం మాతంగి అమ్మవారి ఆవాహనతో భక్తులకు భవిష్యత్ పరిస్థితుల గురించి చెబుతారని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా ప్రజల క్షేమం, రాష్ట్రాభివృద్ధి, వర్షపాతం, వ్యవసాయం, పంటలు, వ్యాధులు, సామాజిక పరిస్థితులు వంటి అనేక అంశాలపై దైవసందేశం వినిపిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ కార్యక్రమంలో భాగంగా మాతంగి పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెబుతారు. ఎలాంటి ఆధారం లేకుండా మట్టి కుండపై నిలబడి చెప్పడంతో భక్తులు అత్యంత పవిత్రమైన దైవవాణిగా భావిస్తారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు.
ఈ భవిష్యవాణిలో కేవలం భవిష్యత్తు గురించే కాకుండా, ఈ ఏడాది నిర్వహించిన బోనాలు, పూజలు, మొక్కులు, ఆచారాలపై అమ్మవారు సంతృప్తి చెందారా లేదా అనే విషయాలను కూడా మాతంగి వెల్లడిస్తారని విశ్వసిస్తారు. భక్తులు, ఆలయ నిర్వాహకులు ఈ సందేశాలను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు.
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గత మూడు దశాబ్దాలుగా మాతంగిగా స్వర్ణలత రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతో తనకు దైవవాణి వస్తుందని ఆమె విశ్వసిస్తారు. ప్రతి ఏడాది బోనాల సందర్భంగా ఆమె చెప్పే జోస్యాన్ని వినేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.