‘దర్శకుడు మధుసూదనరావు’ దగ్గర ఒక కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ కుర్రాడు అంటే మధుసూదనరావుకి బాగా నమ్మకం. అందుకే, తను షూట్ చేయాల్సిన కొన్ని సీన్స్ ను, సాంగ్స్ ను ఆ కుర్రాడికి తీయమని అప్పగిస్తూ ఉండేవారు. శోభన్‌బాబు హీరోగా ‘మల్లెపువ్వు’ సినిమా మొదలైన రోజులు అవి. కొన్ని పాటలను కాశ్మీర్ లో షూట్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కానీ మధుసూదనరావుగారికి ఉన్న ఆరోగ్య సమస్యలు వల్ల కాశ్మీర్ కి రావడానికి ఆయన ఆసక్తి చూపించలేదు.
‘అదేంటయ్యా ? డైరెక్టర్ లేకుండా షూటింగ్ ఏమిటి ?’ అనుకుంటూ శోభన్ బాబు, నిర్మాతలు టెన్షన్ లో ఉన్నారు, అప్పుడే ఆఫీస్ లోకి మధుసూదనరావు ఎంటర్ అవుతూ.. ఆ కుర్రాడి వైపు చూసి ‘నువ్వు వెళ్లి తీసెయ్యరా’ అని లోపలకి వెళ్లిపోయారు. నిర్మాతలు షాక్. కానీ, ఆ కుర్రాడు అంటే హీరో శోభన్ బాబుకు కూడా బాగా నమ్మకం. అందుకే, వెంటనే ఒప్పుకున్నారు. దాంతో నిర్మాతలు కూడా అయిష్టంగానే అంగీకరించారు.
కట్ చేస్తే.. కాశ్మీరులో అందమైన లోయల మధ్యలో షూటింగ్ కి రెడీ అయ్యాడు ఆ కుర్రాడు. గంట తర్వాత షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శోభన్‌బాబు, లక్ష్మి స్పాట్ లో ఉన్నారు. అయినా ఆ కుర్రాడు ఏ మాత్రం భయపడకుండా తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు. అయితే, ఆ సినిమాకు కెమెరామెన్ అయిన ఎస్.వెంకటరత్నంకు ఎక్కడో ఇగో హర్ట్ అయింది. పైగా వెంకటరత్నం అంటే ఆ రోజుల్లో పెద్ద కెమెరామెన్. శోభన్‌బాబును ఏరా అని పిలిచే చనువు ఉన్న వ్యక్తి కూడా.
అందుకే, శోభన్ బాబుతో ఆ కుర్రాడి గురించి మాట్లాడుతూ ‘ఈ ఎదవ చూడు, అప్పుడే పెత్తనం చూపిస్తున్నాడు. ఈడు జీవితంలో డైరెక్టర్ కాలేడురా’ అంటూ సీరియస్ గా ఆ కుర్రాడు వైపే చూస్తూ అన్నాడు. ఆ మాట శోభన్ బాబుకు నచ్చలేదు. అంతే కోపంతో ‘అతను తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడురా, అతనితో జాగ్రత్తగా ఉండు’ అని రెట్టించారు.
అలా అలా వెంకటరత్నం – శోభన్ బాబు మధ్య ఆ కుర్రాడి గురించి వాదులాట జరుగుతుంది. వ్యవహారం ఎంతవరకూ వెళ్లిందంటే, ఆ రోజుల్లో వందరూపాయలు స్టాంప్ పేపరు ఉండేది. అది తెప్పించి.. ఆ కుర్రాడు దర్శకుడు కాలేడు అని కెమెరామెన్ వెంకటరత్నం, లేదు కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు అని శోభన్‌బాబు ఓ పందెం కాసుకున్నారు. కట్ చేస్తే.. నాలుగేళ్లు గడిచిపోయాయి. శోభన్ బాబు నమ్మకమే నిజమైంది. ఆ కుర్రాడు చాల పెద్ద దర్శకుడు అయ్యాడు. అతని పేరే ‘కోదండరామిరెడ్డి’.