Renault Triber Turbo : భారత కార్ మార్కెట్లో ఎంఫీవీ విభాగంలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ తాజాగా ట్రైబర్ టర్బోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.84 లక్షలు. సహజంగా పనిచేసే పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే కొత్త టర్బో వేరియంట్లు రూ.94,000 నుంచి రూ.1.11 లక్షల వరకు అధిక ధరను కలిగి ఉన్నాయి.
మూడు వేరియంట్లలో..
రెనాల్ట్ ట్రైబర్ టర్బోను Evolution, Techno, Emotion అనే మూడు వేరియంట్లలో అందిస్తోంది. Evolution ధర రూ.7.84 లక్షలు కాగా, Techno రూ.8.53 లక్షలు, టాప్-స్పెక్ Emotion ధర రూ.8.99 లక్షలుగా నిర్ణయించారు. Emotion వేరియంట్‌లో డ్యూయల్-టోన్ పెయింట్ కోసం అదనంగా రూ.21,000 చెల్లించాలి.
100hp పవర్.. 180Nm టార్క్
ట్రైబర్ టర్బోలో 1.0-లీటర్, మూడు సిలిండర్ల HR10 టర్బో పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్ రెనాల్ట్ కిగర్, డస్టర్ 1.0లో కూడా అందుబాటులో ఉంది. ట్రైబర్‌లో ఈ ఇంజిన్ 100hp పవర్, 180Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
కేవలం 10.8 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా లీటర్‌కు 21 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుందని రెనాల్ట్ పేర్కొంది.
సస్పెన్షన్‌లోనూ మార్పులు
టర్బో ఇంజిన్‌కు అనుగుణంగా ట్రైబర్‌లో కేవలం ఇంజిన్ మార్పు మాత్రమే కాకుండా పలు మెకానికల్ అప్‌గ్రేడ్లు చేశారు. సస్పెన్షన్ ట్యూనింగ్, యాంటీ-రోల్ బార్లు, థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో మార్పులు చేశారు. నిర్మాణపరమైన మెరుగుదలలతో పాటు బ్రేకింగ్ పనితీరును కూడా పెంచారు. ABS, ESC, ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థలను టర్బో వెర్షన్‌కు అనుగుణంగా రీ-ట్యూన్ చేశారు.
డిజైన్, ఫీచర్లలో ఇవే ప్రత్యేకతలు
ట్రైబర్ టర్బోలో గ్లోస్-బ్లాక్ గ్రిల్, కొత్త రెనాల్ట్ లోగో, LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs ఉన్నాయి. 15-అంగుళాల వీల్స్‌కు డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, గ్లోస్-బ్లాక్ డోర్ హ్యాండిల్స్, ORVMలు అందించారు. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్, గ్లోస్-బ్లాక్ ట్రిమ్‌తో పాటు ప్రత్యేక TURBO బ్యాడ్జ్ ఉంటుంది.
ఏడు సీట్ల ఈ ఎంవీపీలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. మూడో వరుసను మడిచినప్పుడు 625 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ బ్లోయర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
భద్రతకు ప్రాధాన్యం
భద్రత విషయంలో ట్రైబర్ టర్బోలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ISOFIX మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇదే ట్రైబర్ మోడల్ గతంలో Global NCAP క్రాష్ టెస్టుల్లో నాలుగు స్టార్ రేటింగ్ సాధించింది.
మొత్తంగా చూస్తే, తక్కువ ధరలో ఏడు సీట్లు, మెరుగైన పనితీరు, మంచి మైలేజీ కోరుకునే కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ ట్రైబర్ టర్బోను తీసుకొచ్చినట్లు చెప్పొచ్చు.