Dharmendra Pradhan: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, దేశ విద్యావిధానంలో లోపాలపై ఇటీవల కాక్రోచ్ జనతాపార్టీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెల రోజులు ఆందోళన చేసింది. మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసింది. చివరకు మంత్రి ప్రధాని వారించినా వినకుండా పదవికి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజానీమా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. ఒడిశా నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. రాజీనామా తర్వాత వచ్చిన ప్రతిస్పందనలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఇటీవల భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్రను గురించి కొత్త చర్చ మొదలైంది.
ఢిల్లీలో సెట్‌బ్యాక్, ఒడిశాలో అవకాశం?
నైతిక బాధ్యత తీసుకుని పదవి వదిలినట్లు చెప్పుకుంటున్నా, ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని కొందరు భావించారు. కానీ ఒడిశాలో మాత్రం విషయం వేరేలా కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన స్వాగతం కేవలం ఆచారం కాదు. అనేక మంది రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావడం ఆయనకు పార్టీలో ఇంకా బలమైన ఆధారం ఉందని స్పష్టం చేస్తోంది. రాజకీయ వర్గాలు దీన్ని ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశంగా చూస్తున్నాయి.
సీఎం అవుతారని చర్చ..
ప్రధాన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని స్థానిక స్థాయిలో చర్చలు మొదలైంది. ఇది కొందరు స్థానిక నేతల్లో కలవరాన్ని కలిగిస్తోంది. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన సీఎం అభ్యర్థిగా బలంగా ఉన్నప్పటికీ అధిష్ఠానం వేరే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఆ చర్చలు తలెత్తడం సహజం. అయితే వెంటనే మార్పు జరగడం సులభం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత నాయకత్వం, సామాజిక సమీకరణలు, యువత అభిప్రాయం వంటి అంశాలు ఇందులో పాత్ర పోషిస్తాయి.
అధిష్ఠానం నిర్ణయమే కీలకం
ఇప్పటికీ అధికారికంగా ఏమీ స్పష్టం కాలేదు. ఆయనను కొంతకాలం విశ్రాంతి తీసుకునేలా చేయడం, పార్టీ సంస్థాగత పనుల్లో నియమించడం లేదా రాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా పెద్ద పాత్ర ఇవ్వడం వంటి ఎంపికలు ముందున్నాయి. ఒడిశా బీజేపీలో ఆయనకు ఉన్న ప్రభావం, ఎమ్మెల్యేల మద్దతు బలంగా ఉన్నప్పటికీ, అంతిమ నిర్ణయం కేంద్ర అధిష్ఠానం చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయం ఎలా ఉంటుందనేది రాష్ట్రంలో అధికార సమీకరణలను, అంతర్గత సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఢిల్లీలో ఒక అధ్యాయం ముగిసినట్లు కనిపించినా, ఒడిశాలో మరో అధ్యాయం తెరవడానికి దారి తీస్తోంది. ఎయిర్‌పోర్టు స్వాగతం ఆ సంకేతాలను బలపరుస్తోంది. అయితే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఎంత వరకు కీలకమవుతారు, సీఎం పాత్ర వైపు అడుగులు పడతాయా అనేది కేవలం సమయం, అధిష్ఠానం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.