Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే కుటుంబ సభ్యుల అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు జాతీయ మహిళా కమిషన్ ‘మానసిక శక్తి’ పేరుతో ఒక ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో మహిళలు మానసిక ప్రశాంతతను ఎలా పొందాలి? ఒత్తిడిని ఎలా అధిగమించాలి? అనే అంశాలపై పలు సూచనలు చేసింది. అవేంటంటే?
జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో సుమారు 10.5 శాతం మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. వ్యక్తిగతంగా తమ కోసం సమయం కేటాయించుకోలేకపోవడం, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం, మానసిక ఆరోగ్యంపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా మంది మహిళలు చికిత్స తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదని పేర్కొంది.
పిల్లలు పుట్టిన తర్వాత సుమారు 19 శాతం మంది మహిళలు మానసిక క్షోభ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు భావోద్వేగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉదయం లేవగానే ఆందోళన, అతిగా ఆలోచించడం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపించినా వాటిని చాలామంది సాధారణ సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని కమిషన్ తెలిపింది.
అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ ను సూచించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజులోని 24 గంటల్లో కనీసం ఒక శాతం సమయం అంటే 24 నిమిషాలు పూర్తిగా తమ కోసం కేటాయించాలని కమిషన్ సూచించింది. ఇందులో ఉదయం 10 నిమిషాలు రోజును ప్రశాంతంగా ప్రారంభించేందుకు, మధ్యాహ్నం 4 నిమిషాలు శక్తిని తిరిగి పొందేందుకు, సాయంత్రం 10 నిమిషాలు మరుసటి రోజుకు మానసికంగా సిద్ధం కావడానికి ఉపయోగించుకోవాలని పేర్కొంది.
ఈ 24 నిమిషాల్లో మొబైల్ ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. మొదట రెండు నిమిషాల పాటు లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. అనంతరం మనసుకు నచ్చిన ఒక మంచి ఆలోచన లేదా సానుకూలమైన వాక్యాన్ని ఒక నిమిషం పాటు పునరావృతం చేయాలి. ఆ తర్వాత వెంటనే స్పందించకుండా మనసులో వచ్చే ఆలోచనలను నిశితంగా గమనించాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి రోజంతా సానుకూలంగా ఉండేందుకు సహాయపడుతుంది.
రోజులో ఏదో ఒక సమయంలో కోపం, ఆందోళన లేదా ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు శ్వాస వేగంగా మారుతుంది. ఈ సమయంలో శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు విడుదలై మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాంటి సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రశాంతమవడంతో పాటు గుండె స్పందన రేటు కూడా తగ్గుతుందని కమిషన్ తెలిపింది.
రుతుక్రమం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా ఆందోళన, చికాకు, బాధ, కోపం, అతిగా ఆలోచించడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు రావడం సహజమే. వీటితో పాటు తలనొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి, నీరసం వంటి శారీరక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.తుక్రమం సమయంలో ప్రశాంతంగా కూర్చుని రెండు నిమిషాల పాటు లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. భుజాలు, కడుపు కండరాలను రిలాక్స్‌గా ఉంచాలి. రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఈ విధానం పాటించడం మంచిదని కమిషన్ సూచించింది. అలాగే అధిక శ్రమ అవసరమయ్యే పనులను తగ్గించి, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపింది.
