Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి( Posani Krishna Murali ) ఇప్పుడే విముక్తి కలిగేలా లేదు. సుదీర్ఘ రిమాండ్ అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. కానీ సుఖం లేకుండా పోయింది. వారంలో రెండు రోజులపాటు ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే వారంలో ఎలాగోలా వచ్చి సంతకాలు పెడుతున్న పోసాని కృష్ణమురళీకి షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. మళ్లీ పోలీస్ విచారణకు రావాల్సిందేనని నోటీసులు ఇస్తున్నారు. తాజాగా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చకు దారితీస్తోంది. పోసాని కృష్ణ మురళి మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కనిపిస్తుండడంతోనే నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read : వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లకు నో సిగ్నల్.. ‘రాజు’ది గ్రేట్!
* సుదీర్ఘకాలం రిమాండ్..
సోషల్ మీడియా( social media) కేసుల్లో పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అయిన సంగతి విధితమే. ఆయనకు కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి. దాదాపు 26 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోవాల్సి వచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని.. దయచేసి బెయిల్ ఇప్పించాలని కోరినా ఫలితం లేకపోయింది. చివరకు సిఐడి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై బయటకు వచ్చిన క్రమంలో పోసాని కృష్ణ మురళి కన్నీటి పర్యంతం అయ్యారు. బోరున విలపించారు. తీవ్ర మనోవేదనకు కూడా గురయ్యారు. అయితే షరతులతో కూడిన బెయిల్ లభించిన క్రమంలో ఆయన.. వారంలో రెండు రోజులపాటు సిఐడి కార్యాలయానికి వెళ్లి సంతకాలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడును ఎంపిక చేసిన క్రమంలో.. పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా పోలీస్ కేసు నమోదయింది. దానిపైనే నోటీసులు ఇచ్చారు సూళ్లూరుపేట పోలీసులు.
* ఉన్నఫలంగా రాజీనామా..
ఏపీలో( Andhra Pradesh) ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పోసాని కృష్ణ మురళి సైలెంట్ పాటించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడారు. క్రమేపి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని భావించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా.. కూటమికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో ఒక కార్యక్రమానికి సైతం సిద్ధపడ్డారు. అయితే సామాజిక వర్గ సన్నిహితుల ద్వారా హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఫైన్ మార్నింగ్ పోసాని కృష్ణ మురళి కీలక ప్రకటన చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. ఇకనుంచి రాజకీయాల కోసం మాట్లాడడానికి కూడా అన్నారు. కుటుంబ సభ్యులకు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో పోసాని కృష్ణ మురళి ఎపిసోడ్ ముగిసిందని అంతా భావించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. అది మొదలు కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి.
* తెరపైకి కొత్త కేసు..
అయితే ఇటీవల షరతులతో కూడిన బెయిల్ ( conditional bail )లభించడంతో పూర్తిగా రిలాక్స్ అయ్యారు పోసాని కృష్ణ మురళి. ఏ కేసులకు భయపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారో.. అవే కేసులకు బెయిల్ లభించడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావాలని భావించారు. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళి కనిపిస్తున్నారు. ఈ తరుణంలోనే కొత్త కేసులో విచారణకు హాజరుకావాలని సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు ఇవ్వడం విశేషం.