Tata Nano Re Entry: నానో కారు.. సామాన్యుడి కారు కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో టాటా సంస్థ దీనిని ప్రవేశపెట్టింది. రతన్‌టాటా ముచ్చటపడిన ఈ కారు.. కొన్ని సమస్యల కారణంగా కనుమరుగైంది. అయితే సామాన్యుడి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో మళ్లీ మార్కెట్లోకి రావొచ్చన్న చర్చలు ఇటీవల మొదలయ్యాయి. టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్ ఇచ్చిన సమాధానం ఈ ఆశలను మరింత పెంచింది. ట్రై చేస్తాం అన్న ఆయన మాటలతో నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌గా తిరిగి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రతన్ టాటా కలల ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కారు చరిత్ర, విజయాలు, వైఫల్యాలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
నానో ప్రారంభ విజయం
2009లో రూ.లక్ష ధరతో ప్రారంభమైన టాటా నానో ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా రికార్డు సృష్టించింది. రతన్ టాటా దృష్టిలో ఇది కేవలం వాహనం కాదు.. రెండు చక్రాల నుంచి నాలుగు చక్రాలకు మారాలనుకునే సామాన్య కుటుంబాల కలను నెరవేర్చే ప్రయత్నం. అప్పట్లో ఇంజినీరింగ్ అద్భుతంగా నానో చరిత్ర సృష్టించింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త అధ్యాయం తెరిచింది. అయితే కాలక్రమేణా అమ్మకాలు క్షీణించడంతో ఉత్పత్తిని నిలిపివేశారు.
ఎందుకు విఫలమైంది?
నానో వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయి. అత్యంత చవకైన కారుగా ప్రచారం చేయడం వల్ల అది పేదవాడి వాహనంగా గుర్తింపు పొందింది. భారతీయుల్లో కారు కొనుగోలు స్టేటస్ సింబల్‌గా ఉండటంతో చాలా మంది దూరంగా ఉండిపోయారు. భద్రతా అంశాలు, పనితీరు, మార్కెటింగ్ వ్యూహాల్లోని లోపాలు కూడా అమ్మకాలను ప్రభావితం చేశాయి. ఫలితంగా ఒకప్పుడు ఆశలు రేకెత్తించిన ప్రాజెక్టు నిలిచిపోయింది.
ఇప్పుడు రీఎంట్రీ అవకాశాలు
అజయ్ జైన్ వ్యాఖ్యలు నానోను మళ్లీ తీసుకురావాలన్న ఆలోచన ఉందని సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెర్షన్‌గా రావడం గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. నగరాల్లో చిన్న, ఆర్థిక వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. టాటా ఇప్పటికే టియాగో ఈవీ, పంచ్ ఈవీ వంటి మోడళ్లతో బలమైన స్థానం సంపాదించింది. దీనికి తక్కువ ధరలో మరో ఆప్షన్‌గా నానో ఈవీ ఉపయోగపడవచ్చు.
నానో రీఎంట్రీ విజయవంతం కావాలంటే గత తప్పులు నేర్చుకోవాలి. ఇకపై చవకైన కారుగా కాకుండా స్మార్ట్, ఆధునిక, పర్యావరణ హిత వాహనంగా ప్రచారం చేయాలి. బ్యాటరీ ధరలు, రేంజ్, చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు కీలకం. అదే సమయంలో, రతన్ టాటా దృష్టి సామాన్యుడి సౌకర్యం మీదే ఉండాలి. ఈవీలో వచ్చినా ధర సాధ్యమైనంత తక్కువగా ఉండాలి.
మొత్తంగా నానో కథ ఇంకా ముగియలేదు. ఒకప్పుడు ఆశలు రేకెత్తించి, తర్వాత నిరాశపరిచిన ఈ కారు ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి రావచ్చు. అజయ్ జైన్ మాటలు ఆశలు రేపాయ. టాటా సంస్థలోని కొంతమంది మనసుల్లో నానో ఇంకా సజీవంగా ఉందని చూపిస్తున్నాయి. సామాన్యుడి కల మళ్లీ నిజమవుతుందో లేదో చూడాలి.