Visakhapatnam Bay City: ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ.. చారిత్రాత్మకమైన కట్టడాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ పేరు వినగానే ఐటీ కంపెనీలు.. గ్లోబల్ టెక్ సంస్థలు.. సైబరాబాద్.. హైటెక్ సిటీ గుర్తుకు వస్తాయి. ఈ మార్పు వెనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అప్పట్లో హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీని పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరానికి అనుబంధంగా మరో ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానికి బే టెక్ సిటీగా నామకరణం చేశారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం హైదరాబాదులో ప్రారంభమైన ఐటీ విప్లవానికి.. ఇప్పుడు విశాఖపట్నంలో ప్రతిపాదిస్తున్న బే టెక్ సిటీ కి మధ్య చాలా ఆసక్తికరమైన పోలిక ఉంది.
1990 దశకంలో హైదరాబాద్ ను ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలోనే మాదాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎల్ అండ్ టీ కంపెనీ.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటయింది. సుమారు 158 ఎకరాలలో 150 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా సైబర్ టవర్స్ నిర్మాణమైంది.
1998 నవంబర్ 22న అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయి సైబర్ టవర్స్ ను నిర్మించారు. ఆ తర్వాత ఒరాకిల్.. ఐబీఎం.. మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు అడుగులు వేశాయి. హైటెక్ సిటీ చుట్టూ మాదాపూర్.. గచ్చిబౌలి.. కొండాపూర్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఐటీ ఉద్యోగులు.. రియల్ ఎస్టేట్.. హోటల్స్.. వాణిజ్య కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది.
ఇప్పుడు చంద్రబాబు దృష్టి, విశాఖపట్నం నగరం మీద పడింది. హైదరాబాద్ లో సైబరాబాద్ ను అభివృద్ధి చేసిన తరహాలోనే విశాఖపట్నం అనుబంధంగా మరో ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నవంబర్ 19న విశాఖపట్నం.. అమరావతి.. తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో విశాఖ ప్రాంతానికి సంబంధించిన యాంకర్ ప్రాజెక్టుకు విశాఖపట్నం బే సిటీ గా పేరు ఖరారు చేశారు. విశాఖపట్నం కేవలం ఒక నగరంగా కాకుండా పరిశ్రమలు.. ఐటీ.. వాణిజ్యం.. పర్యాటకం.. పోర్టులు.. రవాణా వ్యవస్థలతో అనుసంధానమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేది ఈ ప్రణాళిక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. సైబరాబాద్ తరహాలోనే విశాఖపట్నం నగరానికి అనుబంధంగా కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు.
అప్పట్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఐటీ రంగంలో నిలబెట్టడానికి హైటెక్ సిటీ ఒక పునాదిగా నిలిచింది. ఇప్పుడు విశాఖపట్నం నగరాన్ని బహుళ రంగాల ఆర్థిక కేంద్రంగా తీర్చి దిద్దడానికి బే సిటీ ఒక కీలక ప్రాజెక్టుగా నిలవబోతోంది. విశాఖపట్నం ఎకనామిక్ రివిజన్ పరిధిలో మొత్తం 167 ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 64 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సిటీ ఎకనామిక్ రీజియన్ పథకం ద్వారా 9,180 కోట్లతో 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములను ముందుగానే గుర్తించి, ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ నగరానికి ఒకవైపు విజయనగరం.. మరోవైపు అనకాపల్లి ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు తగిన భూమిని సిద్ధం చేయాలని సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల సమీపంలోనే ఉద్యోగులు.. ప్రజలకు అవసరమైన గృహాలు.. విద్య.. వైద్యం .. రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరానికి సముద్ర తీరం లేదు. విశాఖ నగరానికి అత్యంత సహజమైన సముద్ర తీరం ఉంది. ప్రధానమైన పోర్ట్ ఉంది. పారిశ్రామికమైన వాతావరణం ఉన్నాయి. భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. తద్వారా కనెక్టివిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. పోర్టులు.. విమానాశ్రయాలు.. పారిశ్రామిక క్లస్టర్లు.. రహదారులను పరస్పరం అనుసంధానించడం ద్వారా ఎగుమతులు.. దిగుమతులు.. లాజిస్టిక్ రంగాలకు ఊతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తీర ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా డెవలప్ చేయాలని చూస్తోంది. కైలాసగిరి నుంచి భీమిలి వరకు సుమారు 25 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బే సిటీ ప్రతిపాదన గతంలో తెరపైకి వచ్చింది. ఇందులో పర్యాటకం.. వ్యాపార కార్యకలాపాలు.. నివాసాల అభివృద్ధికి ప్రతిపాదన కూడా అప్పట్లో వచ్చింది.
ఒకప్పుడు హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత ఐటీ రంగం ఈ స్థాయిలో అభివృద్ధి అవుతుందని చాలామంది అనుకోలేదు. మాలిక సదుపాయాల అభివృద్ధి.. పెట్టుబడులను ఆకర్షించే విధానాలు.. అంతర్జాతీయ సంస్థలకు అనుకూలమైన వాతావరణం కారణంగా హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. విశాఖపట్నంలో కూడా అదే స్థాయిలో సదుపాయాలు కల్పిస్తే అది కూడా ఐటి పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రపంచ ఐటీ కార్యకలాపాలకు అమెరికా సిలికాన్ వ్యాలీని కేంద్రంగా చెబుతుంటారు. చంద్రబాబు విజన్ తో విశాఖ సిలికాన్ వ్యాలీని మించి ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు.