YV Subba Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక నేత వైవి సుబ్బారెడ్డి పై విస్తృత చర్చ నడుస్తోంది. ఆయన అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూర్ఖుడు అంటూ సంబోధించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఒంగోలు వైసీపీ నేతలు. కానీ అదే జిల్లాకు చెందిన వై వి సుబ్బారెడ్డి నోరు తెరవకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* ఎన్నో పదవులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బారెడ్డి కీలక నేత. అయితే ఎన్నెన్నో పదవులు లభించాయి పార్టీ వల్ల ఆయనకు. కానీ పార్టీ కష్టకాలంలో మాత్రం ఆయన అండగా నిలవడం లేదు. నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన ఇలానే చేశారు. టీటీడీ లడ్డు విషయంలోనూ అదే పని చేశారు. పరకామణి చోరీ సమయంలో సైతం అదేవిధంగా వ్యవహరించారు. ఆయన మెతక వైఖరి కారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పులు జరిగాయని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అందుకే వైవి సుబ్బారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
* ఇంతవరకు స్పందించరేం?
అయితే జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడం వల్లే వైవి సుబ్బారెడ్డికి అంత ప్రాధాన్యం దక్కింది. నాలుగేళ్లపాటు ఆయనకు టీటీడీ చైర్మన్ గా అవకాసం దక్కింది. ఆపై ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా సైతం ఆయన వ్యవహరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా సుబ్బారెడ్డికి మాత్రం ఏ లోటు రానివ్వలేదు జగన్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే అన్ని పదవులు అనుభవిస్తున్న ఆయన వైసిపి కి మాత్రం ఆశించిన స్థాయిలో పనికి రావడం లేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు మీడియా ముందుకు వచ్చి మాగుంట వ్యాఖ్యలను ఖండించారు. కానీ వై వి సుబ్బారెడ్డి మాత్రం మాట్లాడటం లేదు. అయితే ఆయన మాట్లాడకుండా ఉండడమే మంచిది అని వైసిపి శ్రేణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చి పెడతారు. కానీ జగన్ పై సొంత జిల్లా నేత మాటలను ఖండించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.