YS Vivekananda Reddy Case: నిన్న పులివెందులలో స్థానిక ఎన్నికల జరుగుతున్నప్పుడు.. అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వచ్చారు. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా.. ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న దస్తగిరి జగన్ కాన్వాయ్ కి ఎదురుగా వచ్చారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మా జీవితాలు ఆగం చేశావని జగన్ మీద ఆరోపణలు చేశారు.. దస్తగిరి మాట్లాడిన మాటలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.
దస్తగిరి జగన్ మీద ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. గతంలో వైయస్ సునీత తన తండ్రి మరణం సమయంలో ఎదుర్కొన్న ఆవేదనను పులివెందుల వాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఛానల్ లో వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఇంటర్వ్యూలో సునీత ప్రస్తావించారు. నాడు జరిగిన ఆసంభాషణలో సునీత సంచలన విషయాలను బయటపెట్టారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి పులివెందులలో తన స్వగృహంలో చనిపోయారు. మొదట్లో అది గుండెపోటు అని సాక్షి మీడియాలో వచ్చింది. ఆ తర్వాత రక్తపు మరకలు ఉండడం.. వివేకానంద రెడ్డి చనిపోవడం వంటి పరిణామాలు సరికొత్త చర్చకు దారితీసాయి. ఈ నేపథ్యంలో నాడు వివేకానంద రెడ్డి చనిపోవడానికి కారణం గుండెపోటు కాదని.. హ*త్య అని తెలింది. ఈ విషయం సునీత రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయిన మరుసటి రోజు ఉదయం ఏడు గంటల సమయంలో తెలిసింది. దీంతో ఈ విషయం మీద సునీత రెడ్డి ముందుగా భారతికి ఫోన్ చేసింది. భారతి ఫోన్ నవీన్ ఎత్తారు. నేను మాట్లాడాలి అని సునీత చెబితే.. నవీన్ భారతి తో ఈ విషయం చెప్పారు. ఆ తర్వాత భారతి సునీతకు ఫోన్ చేశారు.
జరిగిన విషయం గురించి సునీత భారతితో చెప్పారు. భారతి ఇదే విషయాన్ని జగన్ తో చెప్పారు. ఆ తర్వాత సునీత జగన్ వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెబితే.. మొత్తం విన్నారు. ఎలా చేద్దామని సునీత అడిగితే.. నీకు ఎలా ఇష్టమైతే అలా చేద్దామని చెప్పారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య ఉదాంతాన్ని పదేపదే జగన్ ప్రస్తావించేవారు. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని అభియోగాలు మోపారు. ఆ తర్వాత సొంత మీడియాలో చంద్రబాబు మీద నారా సుర రక్త చరిత్ర అని తాటికాయ పరిమాణంలో అక్షరాలతో కథనాలు రాయించారు. సునీతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు సునీతకు ఏ కోణంలో కూడా న్యాయం జరగలేదు. కనీసం వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ అయినప్పటికీ.. ఆయన హత్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో నాటి జగన్ ప్రభుత్వం గుర్తించలేకపోయింది.. ఇప్పుడు సునీత మీదనే వైయస్ జగన్ క్యాంపు ఆరోపణలు చేస్తోంది.. చివరికి దస్తగిరి కూడా జగన్ మీద నేరుగా ఆరోపణలు చేసే స్థాయికి పరిస్థితి మారింది. ఒక వ్యక్తి మరణం వెనుక ఏం జరిగింది అనేది . ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా తెలియడం లేదు. తెలిసినవాళ్లు నోరు విప్పడం లేదు. దర్యాప్తు సంస్థలకు మిగతా వ్యక్తులు సహకరించడం లేదు. మొత్తానికి ముంజేతి కంకణం మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ.. నిజాలు మాత్రం బయటపడడం లేదు. అసలు వివేకానంద రెడ్డి హత్య వెనక ఉన్న వ్యక్తులు బయటికి వస్తారా.. లేదా ఆయన హత్య చిదంబర రహస్యం లాగా మిగిలిపోతుందా.. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.