YS Jagan – YS Sharmila : కుటుంబంలో జరగాల్సిన ఓ శుభకార్యం ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య మరో వివాదానికి వేదికగా మారింది. కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించుకోవాలనుకున్న వైఎస్ షర్మిలకు యలహంక ప్యాలెస్ రూపంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పెళ్లి వేదికను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా.. ఇప్పుడు అసలు ఆ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టే హక్కు విషయంలోనూ వివాదం కోర్టు మెట్లెక్కింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
పెళ్లి వేదిక మారినా.. వివాదం మాత్రం ఆగలేదు!
బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో తన కుమార్తె అంజలి వివాహం జరిపించాలని షర్మిల తొలుత నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఆహ్వాన పత్రికలను కూడా ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేశారు. అయితే, ఆ ప్యాలెస్‌లో పెళ్లి నిర్వహించేందుకు జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మారిపోయింది. తన నివాసంగా ఉన్న ప్రాంగణంలో వివాహ వేడుక నిర్వహించడం భద్రతాపరంగా ఇబ్బందులు సృష్టిస్తుందని జగన్ పేర్కొన్నారు.
ఈ మేరకు షర్మిలకు లేఖ రాస్తూ.. అది తన నివాసమని, తన కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. దీంతో చేసేదేమీ లేక షర్మిల తన కుమార్తె వివాహ వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, పెళ్లి వేదిక మారడంతో వివాదం సద్దుమణుగుతుందని భావించిన వారికి తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం మరోసారి షాక్ ఇచ్చింది.
ప్యాలెస్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కోర్టుకెక్కిన జగన్!
కుమార్తె పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల ఆదివారం యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగన్.. ఆమె ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దేవనహళ్లి కోర్టులో సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఇప్పటివరకు కుటుంబ ఆస్తుల పంపకాల చుట్టూ తిరిగిన వివాదం.. ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి ఎవరు వెళ్లవచ్చనే అంశం వరకు చేరింది. కుమార్తె వివాహం కోసం వెళ్లాలనుకుంటున్న సోదరిని అడ్డుకునేందుకు జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రాజకీయంగా, కుటుంబపరంగా చర్చనీయాంశమైంది.
అసలు యలహంక ప్యాలెస్ ఎవరిది?
ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం యలహంక ప్యాలెస్‌పై యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయన్నదే. 2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం యలహంక ఆస్తిపై తనకే హక్కులు ఉన్నాయని షర్మిల వాదిస్తున్నారు. మరోవైపు, ఆ ప్రాంగణం తన నివాసమని జగన్ చెబుతున్నారు. దీంతో ఒకే ఆస్తిపై భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి.
ఈ వ్యవహారంలో వైఎస్ కుటుంబానికి చెందిన మరో కీలక వ్యక్తి విజయమ్మ గతంలో చేసిన ప్రకటన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులోని యలహంక భూమి తన కుమార్తె షర్మిలదేనని ఆమె స్పష్టం చేశారు.
విజయమ్మ ప్రకటనతో మరింత ఆసక్తికరంగా మారిన వివాదం
ఈ ఏడాది మార్చి 20న ‘క్లారిఫికేషన్’ పేరుతో విజయమ్మ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. జగన్ షర్మిలకు రాసిచ్చిన ఎంవోయూలో పేర్కొన్న ఆస్తులతో పాటు, సరస్వతి సిమెంట్స్ సహా ఎంవోయూలో ప్రస్తావించని యలహంక భూమి కూడా షర్మిలకే చెందుతుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనను న్యాయవాదితో నోటరీ చేయించి మరీ విడుదల చేయడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయమ్మ ప్రకటన ఒకవైపు ఉండగా.. మరోవైపు జగన్ కోర్టును ఆశ్రయించడంతో యలహంక ఆస్తి వివాదం మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడు ఈ అంశంలో కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆస్తి వివాదమా.. కుటుంబ సంబంధాల మధ్య అంతరమా?
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల పంపకాల అంశం చాలాకాలంగా చర్చలో ఉంది. అయితే, ఇప్పుడు ఆ వివాదం కుటుంబంలో జరిగే శుభకార్యాలపైనా ప్రభావం చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కుమార్తె పెళ్లి కోసం ప్యాలెస్‌ను వినియోగించుకోవాలనుకున్న షర్మిలకు మొదట వేదిక మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్లే విషయంలోనూ న్యాయపోరాటం ఎదురవుతోంది.
యలహంక ప్యాలెస్ వివాదం కేవలం ఒక ఆస్తి హక్కుల సమస్యగా మిగలకుండా.. వైఎస్ కుటుంబంలోని విభేదాలకు మరో ప్రతీకగా మారింది. దేవనహళ్లి కోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 2019 ఒప్పందం, విజయమ్మ ప్రకటన, జగన్ వాదనల్లో న్యాయస్థానం ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తుంది? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.