YS Jagan Mohan Reddy : ఓవైపు అమరావతి రాజకీయం.. మరోవైపు ఏపీలో మారుతున్న సమీకరణాలు… ఇలాంటి టైమ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారంటే వార్తలొచ్చే వార్తా సంస్థల కంటే యూట్యూబ్‌లో ‘లైవ్ చూసే ప్రేక్షకులకే’ ఎక్కువ ఓపిక కావాలేమో! ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన పెట్టే ప్రెస్ మీట్ మీద ఇప్పుడు బాపట్లలో టీ కొట్టు దగ్గరి నుంచి సోషల్ మీడియా ట్రోలర్స్ వరకు అందరి దృష్టి పడింది.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రెస్ మీట్ పెట్టమంటే.. “నేను బటన్ నొక్కుతా జనాలు చప్పట్లు కొడతారు” అన్నట్లుగా మైకులకు దూరంగా ఉన్న జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే క్రమం తప్పకుండా మైకు ముందుకు రావడం విశేషమే. వైసీపీ కేడర్‌కి ఇది విపరీతమైన ఉత్సాహాన్ని ఇస్తుండొచ్చు కానీ విశ్లేషకులు మాత్రం “అన్నా.. కాస్త కట్ చేయొచ్చుగా!” అని లోలోపల అనుకుంటున్నారు.
గంటల కొద్దీ ఉపన్యాసం.. సగటు ప్రేక్షకుడికి తీవ్ర సవాళ్లు!
జగన్ గారి ప్రెస్ మీట్ మొదలైందంటే చాలు… క్యాలెండర్ లో డేట్ మారుతుందేమో కానీ ఆయన చెప్పే పాయింట్లు మాత్రం ముగియవు!
డీఎస్సీ అంటారు.. ఆ వెంటనే బీసీ రిజర్వేషన్లు అంటారు.. మధ్యలో అమరావతిని లాగుతారు.. పోనీ అక్కడితో ఆగుతారా అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు, చంద్రబాబు అవినీతి అంటూ సుదీర్ఘమైన జాబితా బయటకు తీస్తారు.
ఇన్ని అంశాలను ఒకేసారి ఓ పాకెట్ సైజ్ ప్రెస్ మీట్‌లో వడ్డిస్తే, చూసే జనాలకి ఏ పాయింట్ మైండ్‌లో పెట్టుకోవాలో అర్థం కాక “అసలు అన్నా ఏం చెప్పాలనుకున్నాడు?” అని రీవైండ్ చేసుకునే పరిస్థితి వస్తోంది.
కంటెంట్ ‘ఓవర్ లోడ్’… క్లారిటీ ‘అన్ లోడ్’!
ఇప్పుడున్నది రీల్స్, షార్ట్స్ కాలం. గంటల కొద్దీ మాట్లాడే లెక్చర్ల కంటే, పది సెకన్ల ‘పంచ్ డైలాగ్’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒక్క బలమైన ఆరోపణ, దానికి తగ్గట్టు కొన్ని గణాంకాలు చెప్పి సైలెంట్ అయిపోతే ప్రెస్ మీట్ హైలైట్ అవుతుంది. కానీ జగన్ మాత్రం తన దగ్గరున్న ప్రతీ విషయాన్నీ ఒక్క రోజే ఒక్క ప్రెస్ మీట్‌లోనే చెప్పేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తారు. “ఎక్కువ సేపు మాట్లాడితే ఎక్కువ మైలేజ్ వస్తుందనుకోవడం పొరపాటేమో అన్నా! కేవలం ఒకే ఒక్క విమర్శ, సమాధానం లేని ఒక్క ప్రశ్న ప్రభుత్వం వైపు విసిరితే అదే వారం రోజుల పాటు చర్చగా మారుతుంది.
ఈసారైనా వ్యూహం మారుతుందా?
వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే జగన్ తరచూ మీడియా ముందుకు రావడం మంచి పరిణామమే. కాకపోతే ఈసారి ఆయన ‘లాంగ్ ఫార్మాట్’ వదిలేసి ‘షార్ట్ అండ్ స్వీట్’ ఫార్ములా కిందకి వస్తారా లేదా అనేది అసలు ప్రశ్న. ఇంతకీ ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో జగన్ గారు ఒంటి గంటకే ముగిస్తారా? లేక లంచ్ టైమ్ దాటేసి, ఈసారి కూడా ‘మాటల మోత’తో రికార్డు క్రియేట్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్!