Bajaj Pulsar NS400Z : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పవర్‌ఫుల్ పల్సర్ మోడల్ NS400Zలో కీలక అప్‌డేట్ చేయబోతోంది. 5-ఇంచ్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త NS400Z ఇప్పటికే డీలర్‌షిప్ వద్ద కనిపించింది. దీంతో ఈ అప్‌డేటెడ్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. అయితే, బజాజ్ ఆటో ఇప్పటివరకు అధికారికంగా లాంచ్ తేదీ, ధరలను ప్రకటించలేదు.
ప్రస్తుతం బజాజ్ పల్సర్ NS400Z ధర రూ.1.86 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. సంస్థకు చెందిన అత్యంత వేగవంతమైన పల్సర్‌గా ఇది కొనసాగుతోంది. దసరా, దీపావళి వంటి పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త TFT డిస్‌ప్లే కారణంగా ప్రస్తుత ధర కంటే సుమారు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.
5-ఇంచ్ TFT డిస్‌ప్లేలో ఎన్నో ఫీచర్లు
కొత్త NS400Zలో ప్రధాన మార్పు 5-ఇంచ్ కలర్ TFT స్క్రీన్. ఇందులో బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉంటాయి. బజాజ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌ను డిస్‌ప్లేలోనే చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు ఫోన్ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం లభిస్తుంది.
అంతేకాకుండా కాల్ అలర్ట్స్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్స్‌ను TFT స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలను కూడా ఇందులో స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్లను సులభంగా ఉపయోగించేందుకు స్విచ్‌గేర్‌లోనూ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత బైక్‌లో ఉన్న కలర్ LCD యూనిట్ స్థానంలో ఈ కొత్త TFT స్క్రీన్ రానుంది. NS400Z ఒకే వేరియంట్‌లో, స్వల్పంగా మారిన కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, NS200 టెస్ట్ మ్యూల్‌లో కనిపించిన WP ఫోర్క్‌ను NS400Zలో తీసుకురావడం లేదని సమాచారం.
ఇంజిన్‌లో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చు
ఇటీవలే NS400Zలో ఇంజిన్‌ను బజాజ్ మార్చింది. ప్రస్తుతం 349.13cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ 40.6 hp పవర్, 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గతంలో ఉన్న 373cc ఇంజిన్ స్థానంలో దీనిని తీసుకొచ్చారు. 18 శాతం GST స్లాబ్‌లోకి బైక్‌ను తీసుకురావడంలో ఈ మార్పు కీలకంగా నిలిచింది.
ఇదిలా ఉంటే డీలర్‌షిప్ వద్ద కనిపించిన కొత్త బైక్‌లలో MRF Steel Brace టైర్లు ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టులపై వచ్చిన కామెంట్లు సూచిస్తున్నాయి. ప్రస్తుతం NS400Zలో అపోలో టైర్లు ఉన్నాయి. కొత్త టైర్లతో మెకానికల్ గ్రిప్ మెరుగుపడుతుందా అనేది అధికారిక వివరాలు వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.
మొత్తంగా చూస్తే కొత్త NS400Zలో TFT డిస్‌ప్లేనే ప్రధాన అప్‌డేట్‌గా కనిపిస్తోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బజాజ్ త్వరలోనే ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురావచ్చని ఆటో రంగంలో అంచనాలు ఉన్నాయి.