AP Congress: ఏపీపై( Andhra Pradesh) కాంగ్రెస్ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి బలంగా ఉనికి చాటాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏపీ అసెంబ్లీతో పాటే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయానికి పార్టీ బలం పుంజుకునేలా చేయాలన్నది అధినాయకత్వం ఆలోచన. ముఖ్యంగా ఏపీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రియాంక గాంధీ చూస్తున్నారు. ఆమె నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించి మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా షర్మిలను తొలగించి కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెస్తారని తెలుస్తోంది. ప్రముఖంగా ఓ కాపు నేత పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీ నుంచి అధిక మద్దతు ఉంది. ఇక్కడ ప్రభావం చూపిస్తే ఎన్డీఏ కు ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలపవచ్చన్నది అధినాయకత్వం ఆలోచన.
* షర్మిల తొలగింపు ఖాయం..
2024 ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిలకు( Y S Sharmila ) కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. కానీ ఆమె వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. పైగా ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది. దానికి ధీటుగా వెళ్లాల్సిన షర్మిల జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీని జగన్ దెబ్బతీసి ఉన్నందున కాంగ్రెస్ హై కమాండ్ కూడా షర్మిలను ప్రోత్సహించింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేయడం కాంగ్రెస్ హై కమాండ్ కు నచ్చలేదు. అందుకే ఆమె స్థానంలో కొత్త నేతను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. అది కూడా భవిష్యత్తు ఆలోచనతోనే ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల ఉంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూడరు. భవిష్యత్తులో జగన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
* నేరుగా ప్రియాంక ఫోన్లు..
కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా సోనియా గాంధీ( Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే జాతీయస్థాయిలో బలోపేతం చేయాలంటే ఈ ముగ్గురు నేతలు తలో రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాలి. అందులో భాగంగానే ఏపీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన వారికి నేరుగా ఆమె ఫోన్లు చేస్తున్నారు. అయితే బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన యువనాయకత్వానికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు బాధ్యతలు కట్టబెడితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ మాజీ ఎంపీ మధ్యవర్తిత్వంతో వంగవీటి రాధాకృష్ణతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆయన సానుకూలంగా స్పందిస్తే కాంగ్రెస్ పార్టీలో చేర్పించి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.