Tirumala: కలియుగ వైకుంఠముగా తిరుమల తిరుపతికి పేరు ఉంది. నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా ఈ క్షేత్రం భాసిల్లుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రతిరోజు పండుగలాగే ఉంటుంది. దేశవ్యాప్తంగా యాత్రికులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అందువల్లే తిరుమల నిత్యం యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక అన్నదాన సత్రంలో అయితే రోజూ వేలాదిమంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు.
తిరుమల కొండమీద ఉంటుంది. ఇక్కడ ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తూ ఉంటుంది. కాలుష్యానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా.. కొండమీద జీవవైవిద్యం దెబ్బ తినకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందువల్లే తిరుమల తిరుపతి ప్రపంచంలోనే అత్యంత ఆహ్లాదకరమైన దివ్య క్షేత్రంగా పేరుపొందింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది యాత్రికులు వచ్చినా సరే వారందరికీ.. నీటి సౌకర్యం.. ఇతర వసతి సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తూ ఉంటుంది. ఈ స్థాయిలో నీటి సౌకర్యం కల్పించాలంటే కచ్చితంగా మెరుగైన వనరులు ఉండాలి. ఆ స్థాయిలో తిరుమల తిరుపతికి వనరులు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు నీటితో నిండి ఉండేలాగా దేవస్థానం కృషి చేస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఎల్ నీనో ప్రభావం వల్ల అంతగా వర్షాలు కురవలేదు. తిరుమల తిరుపతి ప్రాంతంలో ప్రతి ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి అలా లేదు. పైగా బ్రహ్మోత్సవాల సమయంలో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఉన్న వనరులలో అంతగా నీరు లేకపోవడంతో దేవస్థానం ఆందోళన చెందింది. ఈ క్రమంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు.
వరుణ యాగం పూర్తి కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం రాత్రి అతి భారీ వర్షం కురిసింది. గంటపాటు విస్తారంగా వర్షం కురవడంతో రోడ్ల మీద వరద నీరు విస్తారంగా ప్రవహించింది. భక్తులు ఆలయ సమీపంలోని వాహన మండపం.. రామ్ బగీచా ఎదురుగా ఉన్న షెడ్లలో తలదాచుకున్నారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో ఎండ వేడి విపరీతంగా ఉంది. ఈ సమయంలో వర్షం కురవడం భక్తులకు ఉపశమనం కలిగించింది.
ఆదివారం.. సోమవారం కూడా తిరుపతిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటీవల వరుణ యాగం పూర్తయిన తర్వాత వర్షం కురవడంతో దేవస్థానం అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వర్షపు నీటిని వృధా కాకుండా డ్యామ్లలోకి తరలించే ఏర్పాట్లు ఉంటాయి. అందువల్లే వర్షపు నీరు డ్యామ్ లలోకి చేరడంతో భక్తులకు నీటి అవసరాలు తీరుతాయని దేవస్థాన అధికారులు చెబుతున్నారు.