AP politics: స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో మజ్జి శ్రీను వైసిపికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు మేనల్లుడు. ఇన్ని రోజులపాటు పార్టీలో ఉండి.. రాజీనామా చేయడంతో చివరికి బొత్స కూడా కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయ జీవితంలో బొత్స ఎన్నో సందర్భాలలో కన్నీరు పెట్టుకున్నారు. కానీ గుక్క పెట్టి ఏడవడం ఇది తొలిసారి.
మజ్జి శ్రీను ఇచ్చిన షాక్ వైసీపీకి గట్టిగానే తగిలింది. స్థానిక ఎన్నికల ముందు వైసిపి అగ్ర నాయకత్వం మజ్జి శ్రీను వ్యవహారం ద్వారా అంతర్మథనంలో పడిపోయింది. ఈ క్రమంలో చిన్న శ్రీను వల్ల ఏర్పడిన అల్ప పీడనం ఉత్తరాంధ్రలో పెను తుఫాన్ లాగా మారకముందే వైసిపి సీను మార్చేసింది. కాకపోతే ఇది ఇంతవరకు ఆ పార్టీకి లాభం చేకూర్చుతుంది అనేది చూడాల్సి ఉంది. కాకపోతే ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీకి బలం తగ్గిపోయింది. కార్యకర్తలు టిడిపి కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలకు అధినాయకత్వం చెప్పుకునే స్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది. ఇలాంటప్పుడు పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే ప్రశ్న కార్యకర్తల నుంచి వ్యక్తం అవుతుంది. మజ్జి శ్రీను బయటికి వెళ్లిపోయిన తర్వాత.. తాము కూడా అదేదారులలో వెళ్లిపోవాలని మెజార్టీ కార్యకర్తలు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
చిన్న శ్రీను రాజీనామా తర్వాత వైసీపీ అధినాయకత్వం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. అంతేకాదు పెద్ద “సీను” క్రియేట్ కాకముందే అప్రమత్తమైంది. చిన్న శీను పార్టీ మారితే.. మిగతావారు కూడా పార్టీని వదిలిపెట్టే అవకాశం ఉందని ఫ్యాన్ పెద్దలు ఒక అంచనాకు వచ్చారు. చిన్న శీను చుట్టాలందరూ రిటర్న్ గిఫ్ట్ మాదిరిగా తమకు షాక్ ఇస్తే తట్టుకోలేమని భావించిన పార్టీ పెద్దలు.. నష్ట నివారణ చర్యలకు దిగారు.
చిన్న శీను వియ్యంకుడు బడ్డుకొండ అప్పలనాయుడిని వెంటనే పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. చిన్న శీను గతంలో బంధుత్వ కోటాలో తెప్పించుకున్న పదవులలో ఉన్న వారందరిని తొలగించేందుకు వైసిపి అధినాయకత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చిన్న శీను మేనమామ బొత్స సత్యనారాయణ.. బామ్మర్దులు.. దూరపు చుట్టాలను కూడా ఇలానే వైసీపీ నాయకత్వం తొలగించగలుగుతుందా.. పదవులు పోయినవారు తాము ఇప్పుడు సంతోషంగా ఉందామని వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తగా సన్యాసినాయుడికి పార్టీ అధినాయకత్వం బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో ఆయన ఏ స్థాయిలో పార్టీని నడిపించగలుగుతారో చూడాల్సి ఉంది.. మజ్జి శీను పార్టీ మారడం ఒక రకంగా వైసిపికి దిమ్మతిరిగే షాక్ కలిగించింది.