CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. లండన్ పర్యటన ముగిసిన తర్వాత ఈనెల 23న ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. అమెరికాలో అనేక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో ఎం ఓ యు లు.. ఇతర ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి వెంట ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ టూర్లో ఆకస్మికమైన మార్పు చోటుచేసుకుంది.
లండన్ వెళ్లడానికి.. అమెరికాలో పర్యటించడానికి అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలోనే విదేశాంగ శాఖకు లెటర్ రాశారు. భారత నిబంధనల ప్రకారం ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలి అంటే కచ్చితంగా విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విద్యాశాఖకు లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన లండన్.. అమెరికా కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో సిడబ్ల్యుసి కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయారు. లండన్ నుంచి ఈనెల 23న ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో అర్ధాంతరంగా లండన్ పర్యటన ముగించుకొని ఇండియాకి రావాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడింది.
రేవంత్ రెడ్డికి విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడం పట్ల తెలంగాణ రాజకీయాలలో చర్చ మొదలైంది. ప్రఖ్యాతమైన విశ్వవిద్యాలయాలతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి మాత్రమే తాను అమెరికా వెళుతున్నట్టు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వికసిత్ తెలంగాణ లక్ష్యంగా.. కేంద్ర విధానాలు అమలు చేసేందుకు తాను అమెరికా వెళుతుంటే.. విదేశాంగ శాఖ మోకాలు అడ్డడం పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎలా తీసుకుంటారని ఆయన విస్మయ వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా పర్యటనకు వెళ్లే విషయంలో రేవంత్ రెడ్డి ముందుగానే విదేశాంగ శాఖకు లెటర్ రాశారు. తన పర్యటన వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా ఆయన వెల్లడించారు. కానీ విదేశాంగ శాఖ మాత్రం ఈ విషయంలో ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష అని ఆరోపిస్తున్నారు. ముందుగానే లెటర్ రాసారని.. అనుమతి కూడా తీసుకున్నారని.. అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారని.. కానీ విదేశాంగ శాఖ అధికారులు ఇటువంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడుతున్నారని.. ఇది క్షమించరాని నేరమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బిజెపి పెద్దలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.