వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయనతో పాటు భార్య, కుమారుడు ఓ ఆస్తి వివాదం కేసులో చిక్కుకున్నారు. అసలైన యజమాని బతికి ఉండగానే ఆయన వారసుల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. తన కుమారుడి పేరుతో రాయించుకున్నారని అభియోగాలు వచ్చాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిజమేనని నిర్ధారించారు. దీంతో అరెస్టుల భయంతో తమ్మినేని ఫ్యామిలీ పరారీ అయింది. తొలుత తమ్మినేని దంపతులకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయింది. తర్వాత శ్రీకాకుళం కోర్టులో కుమారుడికి బెయిల్ లభించింది. అయితే ఈ విషయంలో తమ తప్పు ఏమీ లేదు అని.. తాము సైతం బాధితులం అని తమ్మినేని చెబుతున్నారు. అయితే ఇంత జరిగాక కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమను పలకరించకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు తమ్మినేని.
* ఆస్తివివాదంతో..
శ్రీకాకుళం నగరంలో ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో తమ్మినేని ఫ్యామిలీ చిక్కుకొంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అసలైన యజమాని బతికుండగానే.. ఓ ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి.. అవే పత్రాలతో స్పీకర్ కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులు వచ్చాయి. ఓ నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమి చుట్టూ కంచ వేయడానికి సిద్ధపడ్డారు తమ్మినేని ఫ్యామిలీ. దీంతో అసలైన యజమాని వచ్చి తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు.. తమ్మినేని ఫ్యామిలీ మొత్తం ఇందులో తప్పు చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ తమ్మినేని ఫ్యామిలీతో సహా పరారీ అయ్యారు. అయితే కోర్టుల ద్వారా ముందస్తు బెయిల్ లభించడంతో.. విచారణకు సహకరిస్తున్నారు.
* ఆ మనస్థాపంతోనే..
అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వచ్చారు కానీ.. తమ్మినేని ఇంటి ముఖం చూడలేదు. పలాస కు చెందిన మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చారు. అప్పలరాజు కుమారుడు బైక్ ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయ్యారని.. కానీ తన కుమారుడిని తప్పించి.. కేసును తప్పుదో వ పట్టించి… అమాయకుడిని ఇరికించే ప్రయత్నం చేశారు. ఆ కేసులోనే అప్పలరాజు అరెస్టయ్యారు. అయితే అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లాకు వచ్చారు జగన్. అయితే ఆయన కుమారుడు కోసం చేసిన తప్పిదం మెడకు చుట్టుకుంది. అదే సమయంలో తమ్మినేని సైతం కుమారుడు పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. అప్పలరాజును పరామర్శించి.. తమ్మినేని విస్మరించడంతో ఆయన కోపంతో రగిలిపోతున్నారు. దీనిని ఒక తప్పిదంగా పేర్కొంటున్నారు. పొమ్మన లేక పొగ పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే వ్యవహరిస్తే తిరిగి టిడిపిలో చేరుతానని కూడా సొంత పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.