Sajjala Ramakrishna Reddy And Jagan: రాజు తప్పును, తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తుంటాడు మంత్రి. ఆయననే పాపాల భైరవుడు అంటారు. ఎనలేని కీర్తితోపాటు అధికారాన్ని వెలగబెడుతుంటాడు రాజు. కానీ మంత్రిగా ఉన్నవాడు పాపాలను అనుభవించక తప్పదు. ఎలాంటి మంత్రి అంటే సలహా ఇచ్చేవాడు కనుక. వాటి గురించి బాహాటంగా మాట్లాడేవాడు కనుక. ఇప్పుడు అటువంటి పాపాల భైరవుడు పాత్ర పోషిస్తున్నారు వైసిపి నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం దక్కింది. జగన్ పంచన చేరి సలహాదారుడిగా మారారు. సకల శాఖ మంత్రిగా అనతి కాలంలోనే గుర్తింపు సాధించారు. అయితే అప్పటివరకు నెంబర్ 2 గా ఉన్నవారు ఆయనపై అసూయపడ్డారు. కానీ వారికి తెలియదు ఆ పోస్ట్ పాపాల భైరవుడు పోస్ట్ అని..
* ఎప్పుడూ అదే పోస్టులో
అధికారంలో ఉన్నా.. లేకపోయినా పాపాల భైరవుడు పోస్టు సొంతం చేసుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ కోసం తప్పుడు పనులు చేయించి.. తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎన్ని చేయాలో అన్ని చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని వెనుకేసుకొచ్చింది ఈ పెద్ద మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి కాదా? మూడు రాజధానుల ముచ్చటను చెప్పింది ఆయనే. పోసాని కృష్ణ మురళిని ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాగమంది మన సజ్జలవారే. ఒకటి కాదు రెండు కాదు సకల పాపాల వల్లభుడు, భైరవుడు సజ్జలవారే. ఆయన వల్లే ఓటమి అని సీనియర్లు మొత్తుకునేసరికి జగన్ సైడ్ చేశారు. కానీ జగన్ పాపాలను తమ నెత్తిపై వేసుకునేందుకు సీనియర్లు ముందుకు రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సజ్జలవారే దిక్కయ్యారు. మళ్లీ నెంబర్ 2 స్థానంలో కూర్చోబెట్టారు.
* అమరావతి పై కొత్త పాఠం..
అయితే తనకు అలవాటైన పాపాల భైరవుడు పాత్రను మరిచిపోలేకపోతున్నారు సజ్జల. అందుకే జగన్మోహన్ రెడ్డి కోసం ఎటువంటి పాప భీతి లేకుండా మాట్లాడక తప్పడం లేదు. అందుకే అమరావతికి జై కొట్టారు. నిన్న మొన్నటి వరకు అమరావతి మునిగిపోతుందంటూ ప్రచారం వెనుక పాపాల భైరవుడి ఆదేశాలు ఉన్నాయి. అయితే అవి బెడిసి కొడుతుండడంతో అమరావతికి జై కొడుతున్నారు. జగన్ ముందుకొచ్చి జై కొడితే ప్రజలు అసహ్యించుకుంటారు. అందుకే ఆ పాత్రను తీసుకున్నారు సజ్జల వారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన సాగిస్తారని చెబుతున్నారు. మొత్తానికి అయితే సజ్జలతో ప్రమాదకర ఆట ఆడుతున్నారు జగన్.