Telangana terrorism Traces: భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో పెద్ద నగరాల్లోనే పరిమితమై ఉండేవి. కానీ ఇటీవలి సంఘటనలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకూ ఈ ముప్పు విస్తరిస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇక పట్టుబడుతున్నవారిలో 30 ఏళ్లలోపు యువత ఉండడం మరింత ఆదోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఎన్‌ఐఏ, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇసిస్ (ఐఎస్‌ఐస్) లింక్స్‌తో ఉన్న ఐదుగురు యువకులు అరెస్టయ్యారు. ఈ మాడ్యూల్ ఢిల్లీలో బాంబు దాడులు, విధ్వంసకర కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధమవుతుందని పోలీసులు వెల్లడి చేశారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌ల వ్యాప్తిని, ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లోని చిన్న పట్టణాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.
తీగ లాగితే డొంక కదిలింది..
తాజా ఆపరేషన్ డిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌కు రహస్య సమాచారం ఆధారంగా ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రాంచీలోని ఆషర్ దానిష్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ ఇద్దరు, ముంబైకు చెందిన అఫ్తాబ్ కురేషీ, సుఫియాన్ అబూబకర్ ఖాన్, ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టయ్యారు. వీరి వద్ద సెమీ–ఆటోమేటిక్ పిస్తల్స్, 50 లైవ్ కార్ర్‌తిడ్జ్‌లు, దేశీయ తుపాకీ, ఎయిర్ గన్ పట్టుకున్నారు. రాంచీలో దానిష్‌ను పట్టుకున్నప్పుడు అతని లాడ్జీలో బాంబు తయారీకి ఉపయోగపడే కెమికల్స్(సల్ఫ్యూరిక్ ఆసిడ్, నైట్రిక్ ఆసిడ్, సల్ఫర్ పౌడర్), కప్పర్ షీట్స్, స్టీల్ పైప్స్, సర్క్యూట్ బోర్డులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు సేకరించారు. దానిష్, బుకారో (ఝార్ఖండ్) నివాసి, ఇంగ్లి్లష్ పోస్ట్ గ్రాజ్యుయేట్, 8 నెలలుగా రాంచీలో ఉంటూ ‘గజ్వా లీడర్’, ’సీఈఓ’ అనే కోడ్ పేర్లతో మాడ్యూల్‌ను నడుపుతున్నాడు. అతను వాట్సాప్ గ్రూప్‌లలో తనను ’ప్రొఫెసర్’గా పరిచయం చేసుకుని, యువకులను రాడికలైజ్ చేస్తూ, పాకిస్తాన్ హ్యాండ్లర్స్‌తో సంప్రదింపులు జరిపేవాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కమ్రాన్ ఖురేషీ, ఫండింగ్‌ను హ్యాండిల్ చేసేవాడు. మొత్తం ఐదుగురు అరెస్టులు: దానిష్, అఫ్తాబ్, సుఫియాన్, కమ్రాన్, తెలంగాణకు చెందిన మహ్మద్ యమాన్(బోధన్). వీళ్లంతా 26 ఏళ్లలోపు యువకులు. ఈ మాడ్యూల్ ’ప్రాజెక్ట్ ముస్తఫా’ పేరుతో భారతదేశంలో ఖిలాఫత్ స్థాపించడానికి, బాంబు పేలుళ్లు, ఫిదాయీన్ దాడులు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఐసిస్ ఆన్‌లైన్ రాడికలైజేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా యువకులను రిక్రూట్ చేస్తూ, ఢిల్లీలో ఆపరేషన్‌లు నిర్వహించేందుకు యత్నించారు.
చిన్న పట్టణాల నుంచి కార్యకలాపాలు..
తెలంగాణలో ఈ మాడ్యూల్‌కు బోధన్ (నిజామాబాద్ జిల్లా) లింక్ బయటపడటం ఆశ్చర్యకరం. మహ్మద్ యమాన్(20 ఏళ్లు), అనీస్‌నగర్ నివాసి, ఢిల్లీ పోలీసులు రహస్యంగా బోధన్‌లో దాగి ఉండి అరెస్టు చేశారు. అతని వద్ద పిస్తల్ పట్టుకున్నారు. యమాన్ దానిష్‌తో వీడియో కాల్స్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడని పోలీసులు తెలిపారు. బోధన్ వంటి చిన్న పట్టణంలో ఇలాంటి లింక్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాలు హైదరాబాద్ పాత్‌బస్తీ కేంద్రంగా జరిగేవి. కానీ ఇప్పుడు బోధన్, నర్సాపూర్, నల్గొండ వంటి ప్రాంతాల్లో లింకులు బయటపడుతున్నాయి. 2022లో బోధన్‌లోనే పాకిస్తాన్‌తో లింక్స్ ఉన్న 60 మందికి పాస్‌పోర్టులు ఇచ్చిన ర్యాకెట్ బయటపడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒకరు పట్టుబడి, ప్రశ్నించగా మొత్తం చిరునామా బయటపడింది. అలాగే, బోధన్‌లో కరాటే ఇన్‌స్ట్రక్టర్ అబ్దుల్ ఖాదర్ (52 ఏళ్లు)ను 2022లో అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) తరపున మతోన్మాదాన్ని పెంచి, 200 మంది యువకులకు కరాటే, కుంగ్‌ఫు, ఆయుధాలు శిక్షణ ఇచ్చేవాడు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి కరాటే ఇన్‌స్ట్రక్టర్లు పట్టుబడ్డారు. ఈ సంఘటనలు చిన్న పట్టణాల్లో రాడికలైజేషన్, రిక్రూట్‌మెంట్ పెరుగుతున్నట్లు చూపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని జియాగూడ, మల్లెపల్లిలో ఇసిస్ లింక్స్‌తో ఉన్నవారు పట్టుబడ్డారు. రాయచూర్ (కర్ణాటక)లో ఇద్దరు ఇటీవల అరెస్టయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో లష్కర్–ఏ–తొయిబా సభ్యుడు పట్టుబడ్డాడు. ఈ అరెస్టులు స్థానికుల మధ్య దాగి ఉండి కార్యకలాపాలు చేస్తున్నారని సూచిస్తున్నాయి.
చిన్న పట్టణాల్లో ఎందుకు..?
గతంలో ఉగ్రవాదులు హైదరాబాద్ పాత్‌బస్తీ, ఢిల్లీ వంటి పెద్ద సెంటర్లలో దాగి ఉండేవారు. కానీ ఇప్పుడు బోధన్, నర్సాపూర్ వంటి చిన్న పట్టణాల్లో వ్యాప్తి చెందడం ఆందోళనకరం. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా యువకులను సులభంగా రిక్రూట్ చేయడం. దానిష్ వంటివారు ’ప్రొఫెసర్’, ’సీఈఓ’ రూపంలో ట్రైనింగ్ ఆఫీసర్‌లుగా పనిచేస్తూ, ఇసిస్ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారు. చిన్న పట్టణాల్లో స్థానికులతో కలిసి జీవించడం సులభం. బోధన్‌లో యమాన్ వంటివారు సాధారణ యువకులుగా కనిపించి, ఆయుధాలు, కెమికల్స్ సేకరిస్తున్నారు. పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ద్వారా ఫండింగ్, ట్రైనింగ్. ్కఊఐ వంటి సంస్థలు మతోన్మాదాన్ని పెంచి, మార్షల్ ఆర్ట్స్ శిక్షణల ద్వారా యువకులను తయారు చేస్తున్నాయి. ఈ మాడ్యూల్స్ ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో దాడులు చేపట్టితే, దేశ భద్రతకు తీవ్ర ముప్పు. చిన్న పట్టణాల్లో వ్యాప్తి పోలీసులకు మానిటరింగ్‌లో కష్టం. యువకులు (20–26 ఏళ్లు) రిక్రూట్ అవ్వడం సమాజంలో మత సంక్షోభాలకు దారి తీస్తుంది.
ఈ ట్రెండ్ దేశ భద్రతకు కొత్త సవాలుగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఇంటలిజెన్స్ షేరింగ్ పెంచి, ఉగ్రవాదాన్ని మూలాల వద్ద నివారించాలి. లేకపోతే, చిన్న పట్టణాలు కూడా పెద్ద ముప్పులకు దారి తీస్తాయి.