Pulivendula Politics: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. మరోవైపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్ష పోరాటం జరగనుంది. మున్సిపల్ చైర్మన్ తో పాటు మేయర్, చివరకు జిల్లా పరిషత్తు చైర్మన్ కు సైతం ప్రత్యక్షంగానే ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే ఇది తమకు ప్రయోజనమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపుతామని భావిస్తోంది. ముఖ్యంగా కీలక నేతల నియోజకవర్గాల్లో తమకు అనుకూలం అని అంచనా వేస్తోంది. పులివెందుల మున్సిపాలిటీకి అప్పుడే అభ్యర్థిని సిద్ధం చేసింది. ఎందుకంటే అక్కడ బీటెక్ రవి దూకుడుగా ఉన్నారు. పులివెందుల జడ్పిటిసి కి జరిగిన ఎన్నికల్లోనే ఆయన విశేష ప్రభావం చూపి టిడిపి అభ్యర్థి గెలిచేలా చూశారు. ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల మున్సిపాలిటీ ఆయన విడిచి పెట్టే అవకాశం లేదు.
* గతంలో కుప్పం పై..
సాధారణంగా ప్రతిపక్ష నేత నియోజకవర్గం పై అధికారపక్షం ఫుల్ ఫోకస్ పెడుతుంది. అది అన్నిచోట్ల జరిగేది కూడా. కానీ ఏపీలో మాత్రం ఇదే జరుగుతూ వస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రాతినిధ్య వహించే కుప్పం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ స్థానిక సంస్థలను ఏకపక్షంగా గెలుచుకుంది. చివరకు మున్సిపాలిటీని సైతం వదల్లేదు. అప్పట్లో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా కుప్పం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అనుకున్నది సాధించారు. కానీ సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం కూటమి కచ్చితంగా పులివెందుల పై దృష్టి పెడుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు.
* జగన్ అప్రమత్తం..
మున్సిపల్ ఎన్నికలు అనగానే జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. పులివెందులలో అర్థబలం, అంగ బలం, ఆపై క్లీన్ ఇమేజ్ ఉన్న దుష్యంత్ రెడ్డి అనే యువకుడ్ని రంగంలోకి దించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి దూరపు బంధువు కూడా. అందుకే ఆయనను రంగంలోకి దించారు. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తో కలిసి దుష్యంత్ రెడ్డి పులివెందులలో పర్యటనలు చేస్తున్నారు.. పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ వచ్చారు. దాదాపు ఆయన పేరును మున్సిపల్ చైర్మన్ గా ఖరారు చేసే అవకాశం ఉంది.
* పట్టు బిగిస్తున్న బీటెక్ రవి..
ఇంకోవైపు బీటెక్ రవి పులివెందుల మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గంలో స్థానిక సంస్థలను గెలిచి.. తన సత్తా చాటాలని చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గించగలిగారు. గత ఏడాది జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా పగడ్బందీ వ్యూహంతో అడుగులు వేశారు. ఇప్పుడు కూడా కచ్చితంగా ఆయన ప్రత్యేక ప్రణాళిక వేసి ఉంటారు. టిడిపి కూటమికంటే బిటెక్ రవి అంటేనే ఇప్పుడు వైసీపీ నేతలకు ఒక రకమైన భయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల వైసిపి హయాంలో సైతం బీటెక్ రవి ఎక్కడ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. ఇప్పుడు అధికారంలో ఉండడంతో తనకు తాను ప్రూవ్ చేసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన కచ్చితంగా ఉపయోగించుకుంటారు. మరి పులివెందులలో ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.