BRS: 2014లో అధికారంలోకి వచ్చింది. 2018లో కూడా అధికారాన్ని దక్కించుకుంది. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా.. మిగతా అన్ని ఉప ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపించింది. తద్వారా ఎన్నిక ఏదైనా సరే విజయం మాదే అన్నట్టుగా గులాబీ పార్టీ వ్యవహరించింది. గులాబీ పార్టీ మీడియా.. అనుకూల సోషల్ మీడియాలో జరిగే ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాటి రోజుల్లో నిబంధనలను.. చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని గులాబీ పార్టీ. అందువల్లే ఏకపక్షంగా కార్పొరేషన్లను సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీకి మించిన స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.. ఇలా గులాబీ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ఎవరైనా ఎదురు తిరిగితే.. ఇది ఏంటని ప్రశ్నిస్తే వారి మీద తెలంగాణ వ్యతిరేకులు అని ముద్రవేసింది..
రోజులు అన్ని ఒకే విధంగా ఉండదు.. సాగినంతసేపు సాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులు ఎదురు తిరిగితే వాస్తవం కళ్ళ ముందుకు కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. గులాబీ పార్టీ ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడు స్థానాలలో ఒకదాంట్లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేదు. 2020లో ఆ పార్టీ పదికి పది కార్పొరేషన్లను దక్కించుకుంది. ఇప్పుడు మాత్రం ఒకదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. 116 మున్సిపాలిటీలలో 18 స్థానాలలో మాత్రమే చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. అందులోనూ 13 స్థానాలలో పూర్తి మెజారిటీ మాత్రమే ఉంది. మిగతా ఐదుచోట్ల కాంగ్రెస్ ఇతర నాయకుల పొత్తు పెట్టుకుని మున్సిపల్ స్థానాలను ఖరారు చేసుకుంది.
నాటి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష స్థానానికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాడు తాము పడిన ఇబ్బందులను గులాబీ పార్టీకి అర్థమయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వాస్తవానికి ఇటువంటి విధానాలు ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాకపోయినప్పటికీ.. రాజకీయ పార్టీలు కక్షాపూరితమైన విధానాలు పాటించడంతో రాజకీయాలలో విలువలు అనేవి ఎండమావిగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా గులాబీ పార్టీ తత్వాన్ని ఒంట పట్టించుకోవాలి.