Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ పేరు ఒకరకంగా కంఠస్తంగా మారిపోయింది. నిజానికి రంగనాథ్ అవినీతిపరుడు కాదు. అక్రమార్కులకు వత్తాసు పలికే వ్యక్తి కాదు. తెలంగాణలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి. ఖమ్మంలో.. నల్గొండ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో.. ట్రాఫిక్ భాగంలో.. ఇలా ఎక్కడ పని చేసినా సరే తనదైన సమర్థతను నిరూపించుకున్నారు. కొత్తగా రంగనాథ్ తన గురించి చెప్పుకోవడానికి లేదు. చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ నగరంలో భూకబ్జాలు పెరిగిపోతే ఇదే రంగనాథ్ ఉక్కు పాదం మోపారు. మిర్యాలగూడలో ప్రణయ్ ఘటన జరిగినప్పుడు ఇదే రంగనాథ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూశారు. ఖమ్మంలో కమ్యూనిస్టులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నప్పుడు.. మావోయిస్టు ఉద్యమాలు తీవ్రతరంగా ఉన్నప్పుడు ఇదే రంగనాథ్ వాటిని నిలువరించగలరు. తనకు అందించిన ఏ టాస్క్ అయినా సరే నూటికి నూరు శాతం కమిట్మెంట్తో పనిచేయగలిగిన వ్యక్తి రంగనాథ్.
ఇటీవల జనసేన అధినేత పవన్ కోడి చెరువు వ్యవహారంపై.. రకరకాల ఆరోపణలు వచ్చాయి. కొందరు స్వయం ప్రకటిత జర్నలిస్టులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అడ్డగోలుగా మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించారు. చివరికి ఈ వ్యవహారంలో రంగనాథ్ ప్రవేశించిన తర్వాత.. అసలు విషయాలను బయటపెట్టిన తర్వాత మొత్తానికి కోడి చెరువు వివాదం సమసి పోయింది. అసలు అక్కడ ఎటువంటి ఆక్రమణ జరగలేదని తేలిపోయింది.
ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పటికీ రంగనాథ్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆయన కొంతమందికి వత్తాసు పలుకుతున్నారని.. కొంతమంది సేవలో తరిస్తున్నారని.. అధికారంలోకి వస్తే హైడ్రా అనే వ్యవస్థను బంగాళాఖాతంలో విసిరి పడేస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. పైగా ఇటీవల కోర్టు కేసులు కూడా హైడ్రా అధినేతను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఆయన అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూములను రక్షించడం.. చెరువులను పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటే కోర్టులు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం రంగనాధ్ తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పదవిలో ఉన్నారు.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా కామెంట్లు చేయలేకపోతున్నారు. అందువల్లే ఓ పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని పూర్తిగా బయటపెట్టారు. తనమీద కేసులు పెట్టిన వాళ్లను.. ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇకపై తన 2.0 ఎలా ఉంటుందో చూస్తారని ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రంగనాథ్ ఇలా విమర్శలు చేయడానికి కారణం ఇటీవల పరిణామాలే. ఏది ఏమైనప్పటికీ రంగనాథ్ కూడా ఒక మనిషే. ఆయనకు కూడా కోపం వస్తుంది. అసలు ఇప్పుడు తను హైడ్రాకు అధిపతి. పైగా అక్రమార్కుల మీద సింహ తాండవం చేస్తున్నారు. ఆయనను పదే పదే గెలుకుతున్నారు కాబట్టి కచ్చితంగా రివెంజ్ ఉంటుంది. కాకపోతే అది టన్నుల్లో ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయిన ఆయన ఇంటర్వ్యూ జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది.





