Telangana Assembly Promises: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కరం పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ సారథ్యంలో పాలన సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రస్తుతం పాలన సాగుతోంది. అయితే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీల అమలు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు సగం హామీలే నెరవేరాయని శాసనసభ హామీల అమలు కమిటీ స్వయంగా వెల్లడించింది.
ఇచ్చిన, నెరవేరిన హామీల లెక్కలు ఇవీ..
గడిచిన 12 ఏళ్లలో పాలకులు అసెంబ్లీ వేదికగా 2,266 హామీలు ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు 1,092 అమలయ్యాయి. 1,174 హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో 750 హామీలు గత ప్రభుత్వ కాలంలో ఇచ్చినవి. అసెంబ్లీలో ఇచ్చే హామీలు ప్రజలకు ఇచ్చే నమ్మకం. అవి నెరవేరకపోతే ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచినా సగం హామీలు పెండింగ్‌లో ఉండటం చట్టసభపై అలసత్వం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.
గత, ప్రస్తుత ప్రభుత్వాల పాత్ర
గత ప్రభుత్వ హామీలు ఎక్కువగా మిగిలిపోవడం ఒక వైపు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని సమీక్షించి పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో జరిగిన సమావేశంలో పెండింగ్ హామీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది సానుకూల అడుగు. అయితే కేవలం సమీక్షతో సరిపోదు. సమయ పట్టిక, బాధ్యతలు నిర్ణయించి, పురోగతిని క్రమం తప్పకుండా ప్రజలకు తెలియజేయాలి.
ప్రజలపై ప్రభావం…
హామీలు అమలు కాకపోవడంతో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరదు. అభివృద్ధి పథకాలు, సేవలు, స్థానిక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతాయి. అసెంబ్లీలో ఇచ్చే హామీలు చట్టబద్ధమైన బాధ్యతగా పరిగణించబడాలి. లేకపోతే రాజకీయ ప్రకటనలు మాత్రమేగా మిగిలిపోతాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని బలహీనపరుస్తుంది.
పెండింగ్ హామీలను ప్రాధాన్యత ఆధారంగా వర్గీకరించాలి. కొన్ని వెంటనే అమలు చేయగలిగేవి, కొన్ని దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమైనవి. విభాగాల మధ్య సమన్వయం పెంచాలి. అమలు స్థితిని క్రమం తప్పకుండా అసెంబ్లీకి, ప్రజలకు నివేదించాలి. పారదర్శకత పెరిగితే నమ్మకం పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది.