Pidugu Hariprasad: రాష్ట్ర ప్రభుత్వ విప్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలిసిన వెంటనే హరిప్రసాద్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఎమ్మెల్సీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం హరిప్రసాద్ అస్వస్థతకు గురికాగా వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఈసీజీ, 2 డీ ఏకో పరీక్షలు నిర్వహించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసేన నేతలు ఆయుష్ ఆసుపత్రి దగ్గరకు వచ్చారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు అరగంట పాటు పవన్ కళ్యాణ్ ఆసుపత్రి వద్ద ఉన్నారు.
* ఆందోళనలో జనసైనికులు..
పవన్ కళ్యాణ్ ఆయుష్ ఆసుపత్రిలో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత, కార్డియాక్ సమస్య వచ్చిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తరువాత అసలు విషయం తెలిసి చాలామంది ఉపశమనం పొందారు. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారని తెలుసుకొని ఉపశమనం పొందారు. అయితే ఇంతలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారన్నది ఆ ట్వీట్ల సారాంశం. ఎమ్మెల్సీ అని తెలియడంతో ఎక్కువమంది వాటిని డిలీట్ చేయడం కనిపించింది. మొన్ననే ముంబైలో శస్త్ర చికిత్స చేసుకొని కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం నాటి నుంచి మళ్లీ విధుల్లో పాల్గొంటున్నారు.
* హస్త కళాకారులకు వైద్య శిబిరాలు..
మరోవైపు పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నరసాపురంలోని క్రోచేట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరంలో కంటి సమస్యలను గుర్తించారు. ఆ మరుసటి రోజు ఉచితంగా ఆపరేషన్లు చేశారు. అందుకే విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా హస్త కళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రతి వైద్య శిబిరాన్ని ఆయన కార్యాలయం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.