Jagan Mohan Reddy: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు అందించారు సోదరీమణులు. అంతటా రక్షాబంధన్ సందడి నెలకొంది. కానీ తెలుగు నాట ఇద్దరు ప్రముఖుల కుటుంబాల్లో మాత్రం రక్షాబంధన్ అంటూ వేడుక కనిపించలేదు. గతంలో వారి ఇంటా రక్షాబంధన్ వేడుకలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హైలెట్ అయ్యేవి. అన్నంటే చెల్లెలుకు ఇష్టం..
చెల్లెని వీడని అన్న అంటూ హైలెట్ చేసేవారు సొంత మీడియాలో. కానీ ఇప్పుడు మచ్చుకైనా అటువంటివి లేవు. రక్షాబంధన్ ప్రాధాన్యత చెప్పారే తప్ప.. తమ అధినేతల కుటుంబాలు.. వారి చెల్లెల్లతో వారికున్న అనుబంధం, ఆప్యాయతల గురించి చెప్పలేదు. గతంలో పేజీలకు పేజీలు కలర్ ఫుల్ గా ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇంతకీ వారు ఎవరో ఇట్టే అర్థం అయిపోతుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణలో కేటీఆర్.
* గతంలో పతాక శీర్షికలుగా..
గతంలో రక్షాబంధన్ వస్తే సాక్షి మీడియాలో ఫీచర్ విభాగానికి ఒకటే పని. జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య బంధం ఇది అంటూ కలర్ ఫుల్ గా కథనాలు. అంతే కలర్ ఫుల్ గా ప్రకటనలు. మధ్యలో కుటుంబ సభ్యుల అభిప్రాయాలు. స్నేహితుల అభిప్రాయాలు జోడించి వారిద్దరి గురించి.. వారిద్దరి బంధం గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఇక నమస్తే తెలంగాణలో అయితే కేటీఆర్, కవితల గురించి గొప్పగా వర్ణించేవారు. తోబుట్టువులు అంటే ఇలా ఉండాలి అన్నట్టు అందరికీ అభిప్రాయం కలిగేలా కథనాలు, కలర్ఫుల్ అంశాలను జోడించేవారు. కానీ ఈ తెలుగు రాష్ట్రాల ప్రముఖుల రక్షాబంధన్ వేడుకలు ఈ ఏడాది లేకపోవడం గమనార్హం.
* వేదిక పంచుకునేందుకు ఇష్టం లేక..
అసలు షర్మిలను కలుసుకునేందుకు జగన్.. జగన్తో వేదిక పంచుకునేందుకు షర్మిల ఇష్టపడడం లేదు. అటువంటిది రక్షాబంధన్ నాడు రాఖీ కట్టేందుకు వస్తారు అనుకోవడం నిజంగా భ్రమ. అయితే ఈ ఏడాది రాఖీ బంధం వారి మధ్య లేకపోవడంతో.. సోషల్ మీడియా అంతా షర్మిల పాత ఇంటర్వ్యూలతో హోరెత్తుతోంది. ఇక కవిత ఎక్కడ రాఖీ కడుతుందోనని.. రాజకీయంగా ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని.. కేటీఆర్ విదేశాలకు చెక్కేసారు అనేది ఒక ప్రచారం నడుస్తోంది. ఎలాగైతేనే ఆ రెండు ప్రముఖ కుటుంబాల్లో ఈ ఏడాది రక్షాబంధన్ లేకపోవడం వారి అభిమానుల్లో ఓకింత ఆవేదన కనిపిస్తోంది.