BJP Janasena Alliance: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదని బిజెపి సంకేతాలు ఇచ్చింది. ఢిల్లీ వేదికగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రత్యేక భేటీ జరిగింది. అయితే అక్కడే జనసేనతో పొత్తుపై చర్చ జరిగింది. అయితే జనసేనతో పొత్తు అనేది ఏపీకి మాత్రమే పరిమితం అని.. తెలంగాణలో లేదని క్లారిటీ ఇచ్చింది బిజెపి. దీంతో సొంతంగానే పోటీకి సిద్ధమవుతోంది జనసేన తెలంగాణలో. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటు ప్రభావం చూపించగలిగిన జిల్లాల్లో ప్రాదేశిక ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని చూస్తోంది జనసేన. అయితే ఉన్నట్టుండి బిజెపి జనసేన విషయంలో ఆ ఆలోచన చేయడానికి కారణం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి తో బిజెపి పొత్తు ఉంటుందన్న పరిణామ క్రమంలోనే జనసేన ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే జనసేన మాత్రం ఒంటరి పోరాటానికి అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు సమాచారం.
* సొంతంగా ఎదిగేందుకు..
వాస్తవానికి ఏపీ మాదిరిగా తెలంగాణలో రాజకీయాలు ఉండవు. బిజెపి ఆది నుంచి స్వంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఆ ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం గట్టి ప్రభావం చూపింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎనిమిది పార్లమెంట్ స్థానాలను తెచ్చుకుంది. అయితే బిజెపి అంతలా ప్రభావం చూపడానికి కారణం భారత రాష్ట్ర సమితి బలహీనం కావడమే. అయితే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి బలపడలేదు. ఆ బలాన్ని భర్తీ చేయాలంటే భారత రాష్ట్ర సమితితో పొత్తు బిజెపికి అవసరం. అదే సమయంలో పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలంటే ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవడం భారత రాష్ట్ర సమితికి అవసరం. అందుకే ఆ రెండు పార్టీలు ఇప్పుడు పరస్పరం ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన ను బిజెపి దూరం పెట్టడానికి అదే ప్రధాన కారణం అని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
* ఓట్లు పెంచుకునేందుకు..
తెలంగాణలో మొన్న ఆ మధ్యన జరిగిన పరిణామాలు తెలియనివి కావు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుంచి కొంతమంది వ్యతిరేకించడం ప్రారంభించారు. దీంతో తెలంగాణలో కార్యకలాపాలు మొదలు పెట్టింది జనసేన. హైదరాబాదులో రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే బిజెపితో పొత్తు ఉంటుందన్న తరుణంలోనే ఇలా చేస్తున్నారని అంతా భావించారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన మరోలా ఉంది. అందుకే జనసేనతో పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చింది. కానీ ఏపీ అనుభవాల నేపథ్యంలో ఒంటరిగా ముందు పోటీ చేసి.. ఓట్ల శాతాన్ని పెంచుకుంటే ఇతర పార్టీలు పొత్తుకు ముందుకు వస్తాయని.. అందుకే ఒంటరిగా ముందుకు వెళ్దామని జనసేన వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. సెటిలర్స్ అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు అభిమానులు ఉన్నచోట పార్టీని మరింత బలోపేతం చేయాలని జనసేన భావిస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.