SBI Recruitment 2026: బ్యాంకింగ్ సంస్థలు ఇటీవల వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు శుభవార్త చెబుతున్నాయి. ఇటీవలే పలు జాతీయ బ్యాంకులు నోటిఫికేషన్ ఇచ్చాయి. తాజాగా ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ – సేల్స్) పోస్టులకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సాధారణ భర్తీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డ్రైవ్. మొత్తం 1,538 పోస్టులు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్‌లో 88, తెలంగాణ హైదరాబాద్ సర్కిల్‌లో 32 పోస్టులు ఉన్నాయి.
ఖాళీల వివరాలు..
మొత్తం ఖాళీల్లో ఎస్సీలకు 207, ఎస్టీలకు 1,219, ఓబీసీలకు 112 పోస్టులు కేటాయించారు. ఏపీలోని అమరావతి సర్కిల్‌లో 88, తెలంగాణ హైదరాబాద్ సర్కిల్‌లో 32 ఉన్నాయి. అభ్యర్థులు ఒకే రాష్ట్రం/యూనియన్ టెరిటరీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైతే ఆ రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. స్థానిక భాష (ఏపీ, తెలంగాణలో తెలుగు/ఉర్దూ) పట్టు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్‌లో అవకాశం లేదు.
అర్హతలు ఇవీ..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 2026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అంటే 1998 నుంచి 2006 మధ్య పుట్టి ఉండాలి. రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది. ఇక అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏ విభాగంలోనైనా డిగ్రీ. ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు లేదు. ఓబీసీలు మాత్రం రూ.750 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే. అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ..
ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. సాధారణ ఎస్‌బీఐ క్లర్క్ ప్యాటర్న్‌నే అనుసరిస్తారు. స్థానిక భాష పట్టు తప్పనిసరి కాబట్టి ఏపీ, తెలంగాణ అభ్యర్థులు తెలుగు/ఉర్దూలో సిద్ధం కావాలి.
ఈ నోటిఫికేషన్ బ్యాక్‌లాగ్ ఖాళీలకు మాత్రమే కాబట్టి ఎస్టీ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో మంచి అవకాశం ఉంది. గత సంవత్సరాల్లో ఎస్‌బీఐ క్లర్క్ ఖాళీలు వేల సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు బ్యాక్‌లాగ్‌ను ముందుగా భర్తీ చేయడం ద్వారా రిజర్వేషన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. యువత ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఆగస్టు 27లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు ప్రారంభం: 2026 ఆగస్టు 7
చివరి తేదీ: 2026 ఆగస్టు 27
ప్రిలిమ్స్ (సూచన): 2026 సెప్టెంబర్
మెయిన్స్ (సూచన): 2026 అక్టోబర్/నవంబర్.