Ganja Seized: ఏపీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూడు ఈ మాటే వినిపిస్తోంది. ఇప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడుతుండడం.. హత్యలు చేసి జైలుకు వెళ్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నట్లు కూటమి ప్రభుత్వం చెప్పుకోస్తోంది. కానీ ఇద్దరు పోలీస్ అధికారులు వెళ్తున్న వాహనంలోనే గంజాయి పట్టు పడటం ఆందోళన కలిగిస్తోంది. ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డిక్కీలో గంజాయి పట్టుబడింది. అందులో ఇద్దరు పోలీస్ అధికారులు ఉండడం కూడా సంచలనంగా మారింది. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది.
* రోడ్డు ప్రమాదంతో..
బాపట్ల జిల్లా బల్లికురవ నుంచి అద్దంకి వెళ్తున్న ఒక కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ప్రమాదం అనంతరం ఆ కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కారులో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు సివిల్ దుస్తుల్లో ఉన్నారు. దీంతో స్థానికులు మరింత అనుమానాలు వ్యక్తం చేస్తూ కారును చుట్టుముట్టారు. ఘటనా స్థలానికి అద్దంకి సీఐ సుబ్బరాజు చేరుకోగా.. కారు డిక్కీని తెరవకుండా అడ్డుకున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* స్థానికుల్లో అనుమానం..
అయితే ఆ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారా? లేకుంటే వివిధ కేసుల్లో సీజ్ చేశారా? అది ఎక్కడి నుంచి వచ్చింది అంటూ స్థానికులు ప్రశ్నించారు. కానీ పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గంజాయి దొరికిన పోలీసులు ప్రయాణిస్తున్న కారును పూర్తిగా తనిఖీ చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు. కానీ ఇద్దరు ఎస్ఐలను మరో కారులో అక్కడి నుంచి పంపేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram