AP Paid Surveys: ఏపీలో మళ్లీ పెయిడ్ సర్వేలు ప్రారంభం అయ్యాయి. ఊరు పేరులేని సంస్థలు ప్రజాభిప్రాయాన్ని బయటపెడుతున్నాయి. కొంతమంది సొంత డిజైన్లతో రూపుదిద్దుకున్న పెయిడ్ సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆత్మసంతృప్తి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీ ప్రజలు ఇలాంటి సర్వేలకు అలవాటు పడిపోయారు. ఇలాంటి ప్రచారాలను కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. నో నెవర్ అంటూ పక్కన పెట్టేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన హెచ్చరికలు పంపాయి. కానీ సర్వేలను నమ్ముకున్న ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతింది. అందుకే ప్రజల మూడ్ ఒకలా ఉంటే.. ఇష్టారాజ్యంగా గణాంకాలు ఇచ్చే సర్వే సంస్థల ఆటలు ఎప్పుడో వెళ్లిపోయాయి. కానీ ఇప్పుడు తమకు సర్వేలన్నీ అనుకూలం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడం కాస్తకి అనిపిస్తోంది.
* సర్వేలతో అధికారం పై భ్రమ..
పెయిడ్ సర్వేలు.. ఇవి వాస్తవ సర్వేలు అన్నది ప్రజలకు తెలుసు. అయినా కూటమిపాలనకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది.. ఇంకా మూడు సంవత్సరాలు మిగిలి ఉంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ప్రయత్నాలు వికటిస్తూ వచ్చాయి. ప్రజలు గ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీకి అనుకూల గణాంకాలతో సర్వేలు వస్తే కచ్చితంగా అనుమానిస్తారు. ఇటువంటి సర్వేలను పట్టుకొని వైసిపి అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ భ్రమపడితే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలే దీనికి ఉదాహరణ.
* ప్రజా తీర్పుతోనే..
సర్వేల కంటే ప్రజల తీర్పు ద్వారా వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ సర్వేల్లో వచ్చిన ఫలితాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. అదే గ్రౌండ్ రియాలిటీ అని చూపించడానికి కూడా అర్థం అవుతుంది మైక్రో లెవెల్ లో పల్లెలు, పట్టణాల్లో వాటర్ నాడి ఏ దిశగా ఉందో స్పష్టంగా బయటపెట్టే నిజమైన వేదిక కూడా ఆ ఎన్నికలు. ఇలా పెయిడ్ సర్వేలను నమ్ముకోవడం కంటే.. ప్రజా తీర్పును నమ్ముకుంటే మేలు.
* ఏకగ్రీవాలకు నో ఛాన్స్..
స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రతిపక్షానికి కూడా చోటు ఉండేది. ప్రధాన పట్టణాలతో పాటు జిల్లా పరిషత్తులను సైతం ప్రతిపక్షాలు కైవసం చేసుకునేవి. అంతలా అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించేవారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2021 లో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చివరకు మండలం యూనిట్ గా ఉన్న జడ్పిటిసి స్థానాలను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు అంటే అప్పట్లో ఏ స్థాయిలో ఈ ఎన్నికలు జరిగాయో అర్థం అవుతోంది. అప్పట్లో ఏకగ్రీవాలు చేసుకోండి అని సుభాషితాలు పలికిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్చార్జి పదవులు పోతాయి అంటూ హెచ్చరిస్తున్నారు. ఒకవైపు సర్వేలు.. ఇంకోవైపు తనకోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయాలని ఆదేశాలు ఇస్తుండడం మాత్రం ఎంత మాత్రం సహేతుకం కాదు.