YSRCP: ఏపీలో దూకుడు పెంచింది కూటమి ప్రభుత్వం. వరుసగా అభివృద్ధి పనులను చేపడుతూ వస్తోంది. అయితే ఇటీవల వరుసగా నూతన ప్రారంభోత్సవాలు చేస్తోంది. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం.. ఎమ్మెల్యేల క్వార్టర్లు అందుబాటులోకి తేవడం, తాజాగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడం, మరోవైపు ఉత్తరాంధ్రాకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు సంబంధించి ప్రారంభోత్సవం.. ఇలా వరుసగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై సీఎం చంద్రబాబు సొంతంగా ప్రచారం చేయిస్తున్నారు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన. కానీ అందులో కొంత వరకు నిజం ఉండవచ్చు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయవచ్చు. కానీ ప్రజలే స్వచ్ఛందంగా వైరల్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా గ్రహించుకోవాలి.
* అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యం..
కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది. ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకున్నారు అని 2024 ఎన్నికల ఫలితాల ద్వారా గుర్తించింది. అదే సమయంలో సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మాత్రం దుబారా పథకాలు కాదు. అనవసర ప్రచారం కూడా కల్పించడం లేదు. ఆపై రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న ఈ పనులతో పాటు.. కూటమి వ్యూహాత్మకంగా పూర్తయిన పనులకు వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తోంది. సహజంగానే వీటిపై మీడియా అటెన్షన్ ఉంటుంది. అయితే ప్రతి అభివృద్ధి కార్యక్రమం లో క్రెడిట్ కోసం వైసీపీ సైతం ప్రచారం చేస్తోంది. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. వైసిపి చేస్తున్న ప్రచారం వారికి ఎంత ప్రయోజనం చేకూర్చుతుందో తెలియదు కానీ.. కూటమి ప్రభుత్వానికి మాత్రం ఒక ప్రచారంగా మారిపోయింది.
* వైసిపి క్రెడిట్ కోసం..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. అయితే అదంతా జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితం అంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. అయితే దానివల్ల వైసిపికి వచ్చిన ప్రయోజనం తెలియదు కానీ.. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఎవరు కృషి చేశారు అనేది ప్రధానంగా చర్చ జరిగింది. అదే కాదు రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా అది తమ కృషి ఫలితమే అంటూ వైసీపీ చెబుతోంది. కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అటువంటి పనులు జరగలేదు. ప్రారంభోత్సవాలు సైతం పెద్దగా చేయలేదు. ఇప్పుడు లేని ఆరాటాన్ని.. లేని గొప్పతనాన్ని చెప్పుకుంటూ కాలం గడిపేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అనుకోకుండా కూటమికి ప్రచారం కల్పిస్తోంది ఆ పార్టీ. ఏపీ సమాజంలో మెజారిటీ ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడంతో వారు సైతం.. ఈ పోస్టులను స్వచ్ఛందంగానే వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రచారం కల్పించుకోవచ్చు కానీ.. ప్రతిపక్షం నుంచి కూడా సహకారం అందుతోంది ఈ ప్రచార పర్వంలో..