Visakhapatnam Municipal Election: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధం అవుతోంది. అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు అధికార కూటమిలో ఇప్పటినుంచి పదవుల కోసం నేతలు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ప్రధానంగా విశాఖ మేయర్ పై పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్నం. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖ ఒకటి. ఏడాదికి ఐదు నుంచి వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. మేయర్ పదవి అంటే క్యాబినెట్ పదవితో సమానం. పైగా ప్రత్యక్ష ఎన్నిక కావడంతో బరిలో దిగేందుకు ఆశావహులు ముందుకు వస్తున్నారు. అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఈసారి మేయర్ సీటు ఖాయమని తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఆ పార్టీకి మేయర్ పదవి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పీలా శ్రీనివాస్ రావు రూపంలో టిడిపికి అవకాశం చిక్కింది. అవిశ్వాస తీర్మానం పెట్టి వైసిపి మేయర్ ను దించేసిన సంగతి తెలిసిందే.
* గంటా కుమారుడు పేరు ప్రముఖంగా..
ప్రస్తుతం విశాఖపట్నం మేయర్ గా గంటా రవితేజ పేరు వినిపిస్తోంది. ఆయన గంటా శ్రీనివాసరావు కుమారుడు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పేరు కూడా తెరపైకి వచ్చింది. చాలా రోజులుగా ఆయనకు నేరుగా పదవులు వరించడం లేదు. ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు. మరోవైపు బండారు అప్పలనాయుడు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు. దీంతో ఈ ముగ్గురు పేర్లు చుట్టూ ఇప్పుడు మేయర్ పదవి తిరుగుతోంది. అయితే ముగ్గురు గట్టి అభ్యర్థులు కావడం గమనార్హం. మరి హై కమాండ్ ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది తెలియాలి.
* టిడిపికి బలం ఎక్కువ..
విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల వరకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. అయితే దీని పరిధిని మరింత పెంచుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భీమిలి నియోజకవర్గం లోని చాలా పంచాయితీలు విలీనం కాబోతున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తి దృష్టి పెట్టింది. అయితే గంటా శ్రీనివాసరావు కుమారుడైతే ఆయన ఏకాభిప్రాయం సాధించుకుంటారు అనేది పార్టీలో వినిపిస్తున్న వాదన. పైగా గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కలేదు. ఆ అసంతృప్తి కూడా ఆయనలో ఉంది. అందుకే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ వైపే మొగ్గుచూపుతారు అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి కూడా అదే. ఆయన సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఇప్పుడు కుమారుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గండి బాబ్జి సైతం రేసులో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగానే నిలబడ్డారు. అందుకే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఇస్తారు అన్నది తెలియాలి.