Air Taxi Andhra Pradesh : విమానయానంలో మరో సరికొత్త అధ్యయనం ఆవిష్కృతం కానుంది. కేవలం 2000 అడుగుల ఎత్తులో ప్రయాణించే ఎయిర్ టాక్సీలు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు వేదికగా ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు ఈ ఎయిర్ టాక్సీ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఎయిర్ టాక్సీలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలుత గుంటూరు నుంచి హైదరాబాద్కు ఈ ఎయిర్ టాక్సీలు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రయాణ భారం తగ్గడమే కాదు. త్వరిత సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఈ ఎయిర్ టాక్సీ భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ టాక్సీ ద్వారా చాలా సులభంగా, చాలా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
* ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా..
సాధారణంగా మహా నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మెట్రో, సబర్బన్ రైళ్లలో మినహా.. పది కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు కూడా గంటల సమయం పట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మెట్రో నగరాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలకు కొద్దిగా కొత్త వాహనాలు రోడ్డు పైకి వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ తరుణంలో ఈ సమస్య పరిష్కారానికి వచ్చిందే ఎయిర్ టాక్సీ విధానం. ప్రస్తుతం సరుకు రవాణాకు ఉపయోగపడుతున్న డ్రోన్ల కంటే పెద్ద పరిమాణంలో ఉండి.. ఆకాశమార్గంలో ఇద్దరి నుంచి ఆరుగురికి స్వల్ప దూరాలు తీసుకెళ్లగల ఎయిర్ టాక్సీ లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోని గుంటూరులో ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అవి ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
* 2000 అడుగుల్లోనే..
రెండు వేల అడుగుల ఎత్తులో ఇవి ప్రయాణిస్తాయి. నేలపై, కొంచెం ఎత్తయిన ప్రదేశాల నుంచి గాల్లోకి నిటారుగా పైకి లేచే చిన్నపాటి హెలికాప్టర్ల వంటి ఎయిర్ ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా రన్వే అవసరం ఉండదు. క్యాబ్ ల తరహా లోనే ఇవి ఉంటాయి. రోడ్లపై గంటసేపు ప్రయాణించే దూరాన్ని.. వీటిలో పది నిమిషాల్లో చేరే వీలుంటుంది. విద్యుత్తుతో నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంతో కాలుష్య రహితం. తొలుత వీటిని పైలెట్ల సాయంతోనే నడిపేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ తరువాత క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా.. పైలెట్లు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. కేవలం 200 అడుగుల ఎత్తులో ప్రయాణించే ఈ ఎయిర్ టాక్సీలు ప్రమాదాలకు గురికాకుండా.. తగిన మార్గదర్శకాలను రూపొందించడంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో సైతం ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతాయో..