Mahesh Babu Revanth meeting : సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా రాజకీయ నాయకులను కలవరు. ఒకవేళ కలిసినా.. సినీ పెద్దలతో కలిసి మీట్ అవుతుంటారు. అయితే షూటింగ్ లు.. లేకపోతే కుటుంబంతో కలిసి విహారయాత్రలు.. ఖాళీ సమయం దొరికితే వ్యాపార వ్యవహారాలు మాత్రమే చూసుకుంటారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు.
మహేష్ బాబు ఉన్నట్టుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయ్యారు. వీరిద్దరూ సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీస్తోంది. మహేష్ బాబు పుష్పగుచ్చం ఇచ్చి రేవంత్ రెడ్డిని కలిశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు ముఖ్యమంత్రి కలవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ నడుస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త అనన్య బిర్లా కూడా మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రిని కలిశారు. వచ్చేనెల 7, 8, 9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అనన్య కు రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇండియా జాయ్ కాంక్లేవ్.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రచారానికి మహేష్ బాబు సహకారం కోరడానికే రేవంత్ రెడ్డి. ఈ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది
ఇక హైదరాబాదులో కూడా పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి.. మల్టీప్లెక్స్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. సినీ పరిశ్రమకు సంబంధించిన కీలకమైన వ్యాపారాలు జోరందుకున్నాయి. రాజకీయ వేదికలకు.. ఇటువంటి సమావేశాలకు మహేష్ దూరంగా ఉంటారు. తన పిఆర్ బృందం ద్వారా ఎటువంటి లీకులు ఇవ్వకుండానే.. ఎవరూ ఎటువంటి అంచనాలు వేయకుండానే మహేష్ ముఖ్యమంత్రిని కలవడం వెనుక ఖచ్చితమైన ఎజెండా ఉందని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి.. మహేష్ ఒకే ఫ్రేమ్లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు వివరాలు ఇంతవరకు బయటకి తెలియ రాలేదు. ఈ భేటీ వెనక గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానంతో పాటు.. ఇతర పరిశ్రమ వ్యవహారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీటికీ సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.