Tata Group N Chandrasekaran : టాటా గ్రూప్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. నాయకత్వ మార్పు ఆగిపోయింది. దాదాపు తాను దిగిపోతానని ప్రకటించిన చంద్రశేఖర్ నే మళ్లీ టాటా గ్రూప్ చైర్మన్ గా ఐదేళ్లు ఎందుకు ఎక్స్ టెన్షన్ చేసింది. ఇదేఇప్పుడు వ్యాపార వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. టాటా గ్రూప్‌లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సాధారణంగా ఒక ఛైర్మన్ పునర్నియామకానికి సంబంధించినవి కావు. ఇవి సంస్థ భవిష్యత్ నాయకత్వం, టాటా సన్స్ లిస్టింగ్, టాటా ట్రస్ట్స్ పాత్ర.. ఇలా మూడు కీలక అంశాలను ఒకేసారి ప్రభావితం చేసే నిర్ణయాలుగా మారాయి. ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇది ఆయనకు మూడో ఐదేళ్ల పదవీకాలం కానుంది. అయితే అసలు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కొన్ని వారాల క్రితం మరోసారి ఛైర్మన్‌గా కొనసాగేందుకు తాను ఆసక్తి చూపడం లేదని చంద్రశేఖరన్ బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉంది. కానీ ఇప్పుడు బోర్డు విజ్ఞప్తితో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఎందుకు మళ్లీ చంద్రశేఖరన్‌నే?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. టాటా సన్స్ ప్రస్తుతం సాధారణ పరిస్థితుల్లో లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా సన్స్ NBFC రిజిస్ట్రేషన్‌ను వదులుకోవాలన్న దరఖాస్తును తిరస్కరించిన నేపథ్యంలో.. సంస్థ లిస్టింగ్ దిశగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా కొత్త ఛైర్మన్‌ను తీసుకురావడం అంటే నాయకత్వ మార్పుతో పాటు భారీ వ్యూహాత్మక మార్పులు కూడా రావచ్చు. అందుకే బోర్డులోని మెజారిటీ సభ్యులు ఇప్పటికే గ్రూప్‌ను నడిపిస్తున్న చంద్రశేఖరన్ కొనసాగింపును కోరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే.. ఇది కేవలం వ్యక్తిపై నమ్మకం కంటే కొత్త దశలో స్థిరమైన నాయకత్వం అవసరం అనే బోర్డు ఆలోచనగా చూడవచ్చు.
మరోవైపు నోయల్ టాటా వ్యతిరేకత
చంద్రశేఖరన్ పునర్నియామకానికి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. టాటా ట్రస్ట్స్ మాత్రం ఈ నిర్ణయాన్ని చట్టపరంగా చెల్లనిదిగా పేర్కొంది. ట్రస్ట్స్ వాదన ప్రకారం, టాటా సన్స్ Articles of Associationలోని నిబంధనలను అనుసరించే విధంగానే ఛైర్మన్ ఎంపిక జరగాలి. ఇక్కడ టాటా గ్రూప్‌లోని ఒక కీలక నిర్మాణం అర్థం చేసుకోవాలి. టాటా ట్రస్ట్స్ టాటా సన్స్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. అందువల్ల బోర్డు నిర్ణయం, వాటాదారుల హక్కులు, ట్రస్ట్స్ ప్రతినిధుల పాత్ర.. ఇవన్నీ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంటే.. చంద్రశేఖరన్ కొనసాగింపుపై బోర్డు ఒక వైపు.. టాటా ట్రస్ట్స్ మరో వైపు నిలిచిన పరిస్థితి ఏర్పడింది.
లిస్టింగ్ నిర్ణయం అసలు గేమ్‌చేంజరా?
చంద్రశేఖరన్ పునర్నియామకంతో పాటు టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే దిశగా బోర్డు అడుగులు వేయడం ఈ పరిణామాల్లో మరో పెద్ద అంశం. టాటా సన్స్ గతంలో ప్రైవేట్‌గానే కొనసాగుతూ వచ్చింది. అయితే RBI నియంత్రణలు, NBFC హోదా నేపథ్యంలో లిస్టింగ్ అంశం మళ్లీ ముందుకు వచ్చింది. RBI నిర్ణయం తర్వాత టాటా సన్స్ లిస్టింగ్ అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఇది జరిగితే టాటా గ్రూప్ నిర్మాణంలోనే పెద్ద మార్పు రావచ్చు. ప్రస్తుతం ప్రైవేట్‌గా ఉన్న హోల్డింగ్ కంపెనీ మార్కెట్ ముందుకు వస్తుంది. దీంతో సంస్థ ఆస్తులు, వ్యాపార నిర్ణయాలు, విలువ, షేర్‌హోల్డర్ల ప్రయోజనాలపై మరింత పారదర్శకత అవసరం ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో నాయకత్వంలో మార్పు కంటే కొనసాగింపునే బోర్డు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
మార్కెట్ కూడా ఇచ్చిన సంకేతం ఇదేనా?
బోర్డు నిర్ణయం వెలువడిన తర్వాత పలు టాటా గ్రూప్ కంపెనీల షేర్లలో ర్యాలీ కనిపించింది. టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టీసీఎస్, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. టాటా కెమికల్స్ ఇంట్రాడేలో రెండంకెల లాభాన్ని కూడా నమోదు చేసింది. మార్కెట్ స్పందనను ఒక విధంగా చూస్తే.. నాయకత్వంపై స్పష్టత రావడం, టాటా సన్స్ లిస్టింగ్ దిశగా కదలడం పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన సంకేతంగా కనిపించింది.
ముందున్న అసలు పరీక్ష ఏంటి?
ఇప్పుడు చంద్రశేఖరన్ పునర్నియామకమే చివరి దశ కాదు. ఈ నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటాదారుల స్థాయిలో కూడా తదుపరి ప్రక్రియ ఉండాల్సి ఉంది. అంతేకాదు టాటా సన్స్ లిస్టింగ్ ప్రక్రియ కూడా న్యాయ, నియంత్రణ, కార్పొరేట్ గవర్నెన్స్ అంశాలతో ముడిపడి ఉంది.
అందువల్ల రాబోయే కాలంలో మూడు అంశాలు కీలకం కానున్నాయి. ఒకటి చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ తదుపరి చర్య ఏమిటి? రెండోది టాటా సన్స్ లిస్టింగ్ ప్రక్రియ ఏ వేగంతో ముందుకు సాగుతుంది? మూడోది బోర్డు–ట్రస్ట్స్ మధ్య ఏర్పడిన విభేదాలు ఎలా పరిష్కారమవుతాయి? అన్నదే అసలు చిక్కుముడి.
టాటా సన్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తే చంద్రశేఖరన్ పునర్నియామకం కేవలం మరో ఐదేళ్ల పదవీకాలం కాదు. లిస్టింగ్, నియంత్రణ మార్పులు, భారీ పెట్టుబడులు, గ్రూప్ విస్తరణ వంటి అంశాలు ఒకేసారి ముందుకు వస్తున్న సమయంలో అనుభవజ్ఞుడైన నాయకత్వాన్ని కొనసాగించాలన్న బోర్డు నిర్ణయంగా దీన్ని చూడవచ్చు. అదే సమయంలో నోయల్ టాటా వ్యతిరేకత ఈ నిర్ణయాన్ని మరింత సంక్లిష్టం చేసింది. దీంతో టాటా గ్రూప్‌లో ఇప్పుడు అసలు కథ ‘ఎవరు ఛైర్మన్?’ అనే ప్రశ్నను దాటి.. ‘టాటా సన్స్ భవిష్యత్ పాలన ఎలా ఉండబోతోంది?’ అనే పెద్ద ప్రశ్నగా మారింది.
చంద్రశేఖరన్ మరో ఐదేళ్లు కొనసాగడం ఖరారైనప్పటికీ.. ఈ నిర్ణయానికి సంబంధించిన కార్పొరేట్ గవర్నెన్స్, ట్రస్ట్స్ అభ్యంతరాలు, లిస్టింగ్ ప్రక్రియ తదుపరి నెలల్లో టాటా గ్రూప్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.