Ola Electric : మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. కస్టమర్ల ఆసక్తిని గమనించి కొత్త కొత్త కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయిస్తున్న కంపెనీలలో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి. అయితే, ఇటీవల ఈ కంపెనీకి ఊహించని షాక్ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ అయిన మహారాష్ట్రలో ఓలా ఎలక్ట్రిక్ తన 90 శాతం షోరూమ్‌లను మూసివేస్తుంది. దీనికి కారణం ఆ షోరూమ్‌లకు అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్ లేకపోవడమే. ఇది ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల పై తీవ్ర ప్రభావం చూపించనుంది.
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ఓలా ఎలక్ట్రిక్ కు చెందిన 450 షోరూమ్‌లలో దాదాపు 90 శాతానికి పైగా షోరూంలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్ లేదు. ట్రేడ్ సర్టిఫికేట్ అంటే, రిజిస్టర్ కాని వాహనాలను షోరూమ్‌లలో ఉంచాలన్నా వాటిని కస్టమర్లకు విక్రయించాలన్నా ఈ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఈ సర్టిఫికేట్ లేని కారణంగా మహారాష్ట్ర రవాణా శాఖ ఈ చర్యలు తీసుకుంది. సేవల్లో లోపాలు, రిజిస్ట్రేషన్ సమస్యలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ఓలా ఎలక్ట్రిక్ కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ.
Also Read: మొదటి రోల్స్ రాయల్స్ కారు కొన్న ఆ తెలుగు నటుడు…అంత్యక్రియలను చందలేసుకోని చేశారు..?
జులై 3న మహారాష్ట్ర రవాణా శాఖ రాష్ట్ర రవాణా మంత్రి కార్యాలయానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం స్థానిక దర్యాప్తు బృందాలు అన్ని ఓలా షోరూమ్‌లను పరిశీలించగా, 432 షోరూమ్‌లలో కేవలం 44 షోరూమ్‌లకు మాత్రమే ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్నట్లు తేలింది. సర్టిఫికేట్ లేని మిగతా 388 షోరూమ్‌లను మూసివేయడం జరిగింది. అయితే, మహారాష్ట్రలో షోరూమ్‌ల మూసివేతకు సంబంధించిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, తప్పుదారి పట్టించేవి అని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ పేర్కొంది.
మహారాష్ట్రలో జనాభా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ అత్యధికంగా జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రాష్ట్రంలోనే 2,12,000 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం. ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్థిక సంవత్సరంలో 3,44,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించగా అందులో 12 శాతం కేవలం మహారాష్ట్రలోనే అమ్ముడయ్యాయి. ఈ కారణంగా మహారాష్ట్రలో 90 శాతం షోరూమ్‌లు మూతపడడం కంపెనీకి భారీ నష్టం. ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా సర్వీసుల విషయంలో ఓలా ఎలక్ట్రిక్ పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల కాలంలో వరుసగా ఓలా మీద ఫిర్యాదులు, గొడవలు వస్తుండడంతో దేశంలో ఓలా కంపెనీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.