Maruti Suzuki Cars: దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన రెండు ముఖ్యమైన కార్ల ధరలను 1.4 శాతం వరకు పెంచింది. ముఖ్యంగా 7-సీటర్ ఎర్టిగా, 5-సీటర్ బాలెనో మోడళ్ల ధరలు పెరిగాయి. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. మారుతీ సుజుకీ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ వివరాల గురించి కంపెనీ వెల్లడించింది. మారుతీ సుజుకీ ప్రకారం.. కొత్త నిబంధనల ప్రకారం తమ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం వల్లే ఎక్స్-షోరూమ్ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఎర్టిగా ధర 1.4 శాతం, బాలెనో ధర 0.5 శాతం పెరిగాయి. కొత్త ధరలు జులై 16, 2025 నుంచే అమల్లోకి వచ్చాయి.
Also Read: కొత్త బైక్ కొనే వారందరూ ఈ విషయాన్ని తప్పక గుర్తించండి..
ప్రస్తుతం, ఫ్యామిలీ కార్‌గా, టాక్సీగా బాగా పాపులారిటీ పొందిన ఎర్టిగా ధరలు రూ.8.97 లక్షల నుండి రూ.13.25 లక్షల మధ్య ఉన్నాయి. అలాగే, కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన బాలెనో ధరలు రూ.6.7 లక్షల నుండి రూ.9.92 లక్షల మధ్య ఉన్నాయి. ఇది ఇటీవల కాలంలో మారుతీ కార్ల ధరలు పెరగడం రెండోసారి. మారుతీ సుజుకీ తన పోర్ట్‌ఫోలియోలో అత్యంత చవకైన ఆల్టో నుంచి అత్యంత ఖరీదైన ఇన్విక్టో వరకు అనేక మోడళ్లను వినియోగదారుల కోసం అందిస్తుంది. వీటితో పాటు, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, ఇగ్నిస్, ఈకో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్, బ్రెజా, సియాజ్, గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6, జిమ్నీ వంటి మోడళ్లను తయారు చేసి విక్రయిస్తుంది. భారత ప్యాసింజర్ కార్ మార్కెట్‌లో మారుతీ సుజుకీ మార్కెట్ వాటా దాదాపు 40 శాతం వరకు ఉంది. ఇది ఇతర ఏ కంపెనీకి అందనంత ఎత్తులో ఉంది.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
కార్ల ధరలలో మార్పులు ఉన్నప్పటికీ, బుధవారం బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేర్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. కంపెనీ షేర్లు రూ.30.65 (0.24%) పెరిగి రూ.12,565.60 వద్ద ముగిశాయి. కంపెనీ షేర్లు తమ 52-వారాల గరిష్ట స్థాయికి దగ్గరగా ట్రేడవుతున్నాయి. దీని 52వారాల గరిష్ట స్థాయి రూ.13,675.00 కాగా, కనిష్ట స్థాయిరూ.10,725.00గా ఉంది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. మారుతీ సుజుకీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.3,95,065.70 కోట్లుగా ఉంది.