YouTuber Vaishnavi Case : నిజామాబాద్ నగర నడిబొడ్డున గురువారం సాయంత్రం వెలుగుచూసిన ఘోరం ప్రశాంతంగా ఉండే వీధులను ఒక్కసారిగా భయాందోళనలోకి తోసేసింది. అందరూ తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉన్న వేళ ఆర్‌ఆర్ చౌరస్తాలోని థియేటర్ సమీపంలో కూరగాయల మార్కెట్ వద్ద చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల నడుమ సంచరిస్తూ సాయంత్రపు సందడితో కళకళలాడే ఆ ప్రాంతంలో కొద్ది నిమిషాల్లోనే చోటుచేసుకున్న ఈ భయంకర సంఘటన ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది.
క్షణాల్లో ముగిసిన జీవితం
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్షణాల వ్యవధిలో హరిబాబుపై కొబ్బరికాయలు కోసే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కత్తుల ఘాతానికి చిత్తరి హరిబాబు రక్తం ఓడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాపాడమని కేకలు వేసేందుకు కూడా సమయం లేకుండా అంతా చూస్తుండగానే హంతకులు అదే కారులో పరారయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో రక్తపు మడుగులో పడివున్న హరిబాబును చూసి చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు.
సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు, నగర ఏసీపీ ప్రకాష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
పాత కక్షలే ప్రాణాలు తీశాయా?
మృతుడు చిత్తరి హరిబాబు, గతంలో దారుణ హత్యకు గురైన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త అని సమాచారం వ్యాపించడంతో ఈ ఘటన మరింత కలకలం రేపింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మార్చి 2026లో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య తీవ్ర కలకలం రేపింది. ‘వైషు అమ్మ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ పాపులర్ అయిన వైష్ణవిని (20) ఆమె భర్త చిత్తరి హరీబాబే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. వైష్ణవి, హరీబాబు ప్రేమించుకుని దాదాపు పది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని నెలలకే అదనపు కట్నం తెవాలని హరీబాబు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ సంపాదన విషయంలో, అలాగే అతనికి ఉన్న మరొక వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. మార్చి 16 రాత్రి గొడవ తీవ్రమవ్వడంతో నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా హరీబాబు వైష్ణవిని కత్తితో తీవ్రంగా పొడిచి చంపేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం రక్తం మడుగులో ఉన్న వైష్ణవిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.కోరుట్ల పోలీసులు హరీబాబును, అతనికి సహకరించిన అతని తల్లి , సోదరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిండు గర్భిణిని కట్నం వేధింపులతో దారుణంగా హత్య చేయడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
గతంలో వైష్ణవి ఎదుర్కొన్న దారుణ పరిణామాలు, ఆ కుటుంబంలో నింపిన శోకం ఇంకా మానకముందే.. ఇప్పుడు ఆమె భర్త కూడా ఇలా దారుణంగా హత్య చేయడంతో వైష్ణవి హత్యకు ప్రతీకారం పూర్తయ్యిందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చావుకు చావే పరిష్కారం.. యూట్యూబర్ వైష్ణవి మరణానికి ఇదో రియల్ ప్రతీకారం అని ఆ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల గాలింపు తీవ్రం
హంతకులు వేరే జిల్లాకు చెందినవారుగా ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా చేసుకుని హంతకుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.