Trump 2028 Cap: అగ్రరాజ్యం అమెరికాకు ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేయాలి. ఇది ఆదేశ రాజ్యంగంలో ఉంది. ఇప్పటి వరకు చేసిన నేతలంతా దానినే అనుసరిస్తున్నారు. కానీ, తెలంగాణ సీఎం 2035 వరకు నేనే సీఎం అని ప్రకటిస్తున్నట్లుగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కూడా మళ్లీ వచ్చేది నేనే అని ప్రకటనలు చేస్తున్నారు. పరోక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 2024లోనే ఎందుకు ఎన్నుకునామని అమెరికన్లు బాధపడుతున్నారు. మరోవైపు ట్రంప్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్న సంకేతాలు ఇస్తున్నాడు. తాజాగా ట్రంప్ ఇటీవల ట్రూత్ సోషల్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన ‘ట్రంప్ 2028’ అని రాసిన టోపీ ధరించి ఉన్నారు. దానికి క్యాప్షన్.. ‘2028లో మనం గెలవబోతున్నాం’ (We are going to win). ఈ పోస్ట్ వెంటనే రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన ఇటీవలే చెప్పిన మాటల నేపథ్యంలో ఇది మరింత ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ ఏమన్నారు.. ఏం చేశారు?
కొన్ని రోజుల క్రితం ట్రంప్‌ను 2028లో మళ్లీ పోటీ చేసే అవకాశం గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. ‘నేను పరుగెత్తాలని చాలా ఇష్టపడతాను. కానీ చట్టం చాలా బలంగా ఉంది. అందరూ నన్ను అడుగుతున్నారు, సపోర్టర్లు 2028 అని అరుస్తున్నారు. కానీ చట్టం బలంగా ఉంది.’ అని స్పష్టంగా చెప్పారు. ఇలా చెప్పిన కొద్ది రోజులకే 2028 టోపీతో ఫొటో పెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కొందరు దీన్ని రాజకీయ ట్రోలింగ్‌గా, కొందరు నిజమైన ఆకాంక్షగా చూస్తున్నారు.
రాజ్యాంగం ఏం చెబుతుంది..
అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ(1951లో ఆమోదం) స్పష్టంగా చెబుతుంది.. ఏ వ్యక్తినైనా అధ్యక్షుడిగా రెండు సార్లు మాత్రమే ఎన్నుకోవచ్చు. ట్రంప్ 2016, 2024లో గెలిచి ఇప్పటికే రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. కాబట్టి 2028లో ఆయన పేరు బ్యాలెట్‌పై ఉండటం రాజ్యాంగపరంగా అసాధ్యం. ఈ సవరణ ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ నాలుగు సార్లు గెలవడం తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఇది దృఢంగా ఉంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో రెండింతల మెజారిటీ, తర్వాత 50లో 38 రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇది అసాధ్యం.
ఈ పోస్ట్ వెనకున్న ఆంతర్యం ఏమిటి?
ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా 2028 టోపీలు, జోకులు, సూచనలు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండగా ఇలా చేయడం కొన్ని అర్థాలను సూచిస్తుంది. ఒకటి మద్దతుదారులను ఉత్సాహపరచడం.. ఆయన అభిమానులు 2028ని గురించి అరుస్తూ ఉంటారు. ఈ పోస్ట్ వారి ఆశలను సజీవంగా ఉంచుతుంది. రెండోది రిపబ్లికన్ పార్టీలో తన ప్రభావాన్ని 2028 వరకు కొనసాగించాలని చూపించడం. మూడోది డెమొక్రాట్లు, విమర్శకులు దీన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించే ప్రయత్నంగా చూస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ట్రంప్‌కు రాజకీయంగా లాభదాయకం.
ట్రంప్ ముందు సవాళ్లు..
2028 ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నాయి. ట్రంప్ ప్రస్తుత పదవీకాలం 2029 జనవరి వరకు ఉంటుంది. ఆయన వయస్సు, ఆరోగ్యం, పార్టీలోని కొత్త నాయకుల ఎదుగుదల ఇవన్నీ కీలకం. ఒకవేళ ఆయన నిజంగానే మూడోసారి ప్రయత్నించాలనుకుంటే, అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చు. కానీ ప్రస్తుతం ఆయన చట్టం బలంగా ఉందని అంగీకరిస్తున్నారు.
ఈ పోస్ట్ ఒక వైపు ట్రంప్ రాజకీయ శైలిని ప్రతిబింబిస్తుంది. ఎప్పుడూ చర్చలో ఉండాలని, మద్దతుదారులను ఉత్సాహపరచాలని. మరోవైపు ఇది అమెరికా ప్రజాస్వామ్యంలో టర్మ్ లిమిట్స్ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. రాజ్యాంగం ఎవరినైనా పరిమితం చేస్తుందని చూపిస్తుంది.