Sheikh Hasina Press Meet: రెండేళ్ల క్రితం 2024 ఆగస్టు 5న దేశం వదిలి భారత్‌లో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా, 2026 ఆగస్టు 5–6 తేదీల్లో ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ వేదికగా ఆడియో ప్రెస్ మీట్ నిర్వహించారు. కుమారుడు సజీవ్ వాజెడ్ జాయ్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రక్షణ కారణాలతో వీడియో విడుదల కాలేదు. డిసెంబర్‌లో స్వదేశం తిరిగి వెళ్తానని ప్రకటించడం, ఆర్థిక సూచికలు, ప్రస్తుత పరిస్థితులపై వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కించాయి.
హసీనా కీలక ప్రకటనలు..
హసీనా తన పాలనలో అభివృద్ధి రేటు 6.6 శాతం ఉండగా ప్రస్తుతం 2.2కు పడిపోయిందని, పెట్రోల్ ధరలు, రవాణా ఇబ్బందులు, హార్మజ్ జలసంధి సమస్యలు, టెక్స్‌టైల్స్ పరిశ్రమ సంక్షోభం వంటివి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పెరుగుతోందని తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని, తిరిగి స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిన నెల కావడం, పాకిస్తాన్ వ్యతిరేక పోరాటం జరిగిన సందర్భం కావడం వల్ల ఆ నెలను ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ఆమె వయసు 80కి చేరువగా ఉండటం, అవామీ లీగ్ బలాన్ని తిరిగి నిర్మించాలనే లక్ష్యం కనిపిస్తోంది. భారత్ ఈ కార్యక్రమానికి అధికారికంగా సంబంధం లేదని, ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించినదని, ఆమె వ్యాఖ్యలను ఆమోదించడం లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని తీవ్రంగా స్పందించింది.
భారత్ విషయంలో బంగ్లాదేశ్ ద్వంద్వ వైఖరి..
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచి చొరబాటుదారులను తిరిగి పంపించే ప్రయత్నాల్లో బంగ్లాదేశ్ సహకారం సరిగా లేకపోవడం, స్వచ్ఛందంగా వెళ్లేవారికి అడ్డంకులు, గుర్తింపు ఆధారాలు లేవనే వాదనలు సమస్యలను పెంచుతున్నాయి. ఇది రెండు దేశాల మధ్య నమ్మకం లోపాన్ని సూచిస్తోంది. ఇక గంగా జలాల ఒప్పందం 2026 డిసెంబర్‌లో ముగుస్తోంది. తీస్తా జలాల పంపిణీ కూడా పాత సమస్యగానే ఉంది. 4096 కి.మీ. సరిహద్దు ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా ఎక్కువగా భారత్ మీదుగానే జరుగుతుంది. అయినా ఈ ఒప్పందాల పునరుద్ధరణపై సమగ్ర చర్చలు ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా ఎన్నికైన ప్రధాని తారీక్ రెహ్మాన్ చైనా పర్యటన చేసినా భారత్‌కు ఇంకా రాలేదు.
రాజకీయ లెక్కలు..
బంగ్లాదేశ్‌లో జమాతే ఇస్లామీ బలపడుతుందనే భయం, అవామీ లీగ్ తిరిగి క్రియాశీలం కావడం వల్ల మతోన్మాద శక్తులను అదుపు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. హసీనా క్రియాశీలత తారీక్ రెహ్మాన్‌కు కూడా రాజకీయంగా ఉపయోగపడవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది భారత్ వ్యూహాత్మక ఒత్తిడా, హసీనా స్వంత ఎత్తుగడా, లేదా రెండూ కలిసిన పరిణామమా అనే సందేహాలు మిగులుతున్నాయి. హసీనా భారత అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే భారత ప్రభుత్వం అధికారికంగా దూరం పాటిస్తూ ఉంది. ఈ ప్రెస్‌మీట్ బంగ్లాదేశ్‌ను భారత్‌తో చర్చలకు నెట్టే అవకాశం సృష్టించింది. చొరబాట్లు, నదీ జలాలు, సరిహద్దు భద్రత వంటి అంశాలపై త్వరలో సంభాషణలు జరగవచ్చు. అయితే నమ్మకం పునరుద్ధరణకు రెండు పక్షాలు కూడా సానుకూల వైఖరి అవలంబించాలి. హసీనా తిరిగి రావాలనే ప్రకటన బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలను మరింత సంక్లిష్టం చేస్తుంది. అవామీ లీగ్ బలం పెరిగితే జమాతే ఇస్లామీ వంటి శక్తులు తగ్గుముఖం పట్టవచ్చు. కానీ ఆమెపై ఉన్న చట్టపరమైన సమస్యలు, మరణశిక్ష తీర్పు వాస్తవాలను విస్మరించలేం.
మొత్తంగా చూస్తే, ఈ సంఘటన కేవలం ఒక ప్రెస్‌మీట్ మాత్రమే కాదు. ఇది భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లోని అపార్థాలు, ఆర్థిక–భద్రతా సమస్యలు, ప్రాంతీయ భూరాజకీయాలను మళ్లీ ముందుకు తెచ్చింది. రాబోయే నెలల్లో నదీ జలాల ఒప్పందాలు, సరిహద్దు సహకారం, రాజకీయ స్థిరత్వం ఎలా ముందుకు సాగుతాయనేది చూడాలి.