Homeటాప్ స్టోరీస్State Finances 2025-26 : 2025-26లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

State Finances 2025-26 : 2025-26లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

State Finances 2025-26 :  దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల బడ్జెట్లు, ఆదాయాలు, వ్యయాలు, అప్పులు, ద్రవ్యలోటు వంటి అంశాలను పరిశీలిస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మొత్తంగా ఆశాజనకంగానే కనిపిస్తోంది. అయితే కొన్ని ఆర్థిక సవాళ్లు కూడా ఉన్నట్లు నివేదిక గణాంకాలు సూచిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక నిర్వహణను పరిశీలిస్తే గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ (GFD) స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి […]

State Finances 2025-26 :  దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల బడ్జెట్లు, ఆదాయాలు, వ్యయాలు, అప్పులు, ద్రవ్యలోటు వంటి అంశాలను పరిశీలిస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మొత్తంగా ఆశాజనకంగానే కనిపిస్తోంది. అయితే కొన్ని ఆర్థిక సవాళ్లు కూడా ఉన్నట్లు నివేదిక గణాంకాలు సూచిస్తున్నాయి.

రాష్ట్రాల ఆర్థిక నిర్వహణను పరిశీలిస్తే గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ (GFD) స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP)లో 3.3 శాతంగా ఉన్నట్లు అంచనా. అంటే రాష్ట్రాలు చేస్తున్న మొత్తం వ్యయానికి.. వాటి ఆదాయాలకు మధ్య ఉన్న లోటు ఈ స్థాయిలో ఉందన్నమాట. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకంగా మారింది.

మూలధన వ్యయానికి పెద్దపీట

ఆర్బీఐ నివేదికలో మరో ముఖ్యమైన అంశం మూలధన వ్యయం (Capital Expenditure). రాష్ట్రాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేస్తున్న ఖర్చును కొనసాగిస్తున్నాయి. 2025-26లో రాష్ట్రాల మూలధన వ్యయం జీడీపీలో 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2023-24, 2024-25లో ఇది 2.7 శాతంగా ఉంది.

రోడ్లు, రవాణా, విద్యుత్, నీటిపారుదల, పట్టణ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెరగడం దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఈ విషయంలో రాష్ట్రాలు సానుకూల దిశగా అడుగులు వేస్తున్నాయని ఆర్బీఐ విశ్లేషణ చెబుతోంది.

రాష్ట్రాల ఆదాయాలు.. ఖర్చులు ఎలా ఉన్నాయి?
రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో నిధులు సమకూరుతాయి.

2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రాల మొత్తం రెవెన్యూ రాబడులు రూ.51.3 లక్షల కోట్లుగా ఉండనున్నాయి. ఇందులో రాష్ట్రాల సొంత ఆదాయాలు రూ.29.8 లక్షల కోట్లు కాగా, కేంద్రం నుంచి వచ్చే బదిలీలు రూ.21.5 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

మరోవైపు రాష్ట్రాల రెవెన్యూ లోటు జీడీపీలో 0.2 శాతంగా ఉండనుంది. అంటే రోజువారీ ప్రభుత్వ నిర్వహణ, ఇతర రెవెన్యూ ఖర్చులకు సంబంధించి ఆదాయానికి, వ్యయానికి మధ్య ఉండే అంతరం గతంతో పోలిస్తే తగ్గుతుందని బడ్జెట్ అంచనాలు సూచిస్తున్నాయి.

అప్పుల భారం ఆందోళన కలిగిస్తోందా?

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ అప్పుల భారం, భవిష్యత్తులో చెల్లించాల్సిన ఆర్థిక బాధ్యతలు ఆర్బీఐకి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో అప్పుల స్థాయులు అధికంగా ఉండటం, హామీల రూపంలో ఉన్న ఆర్థిక బాధ్యతలు పెరగడం సవాళ్లుగా మారుతున్నాయి.

2021 మార్చి నాటికి రాష్ట్రాల మొత్తం బకాయి అప్పులు జీడీపీలో 31 శాతానికి చేరగా, 2024 మార్చి నాటికి 28.1 శాతానికి తగ్గాయి. అప్పుల నిర్వహణలో కొంత మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ సూచిస్తోంది.
కేంద్రం నుంచి వడ్డీ లేని రుణాలు.. రాష్ట్రాలకు ఊరట
రాష్ట్రాల మూలధన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం కింద ఈ సహాయం అందుతోంది.

ఈ రుణాలు రాష్ట్రాల మూలధన వ్యయానికి తోడ్పడుతున్నాయి. అయితే ఇవి సాధారణ రుణ పరిమితికి అదనంగా ఉండటంతో రాష్ట్రాల ద్రవ్యలోటు గణాంకాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

మొత్తంగా ఎలా ఉంది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి?

ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే 2025-26లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా ఏమీ లేదు. ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉన్నప్పటికీ మూలధన వ్యయాన్ని పెంచడం, రెవెన్యూ లోటును తగ్గించడం సానుకూల పరిణామాలు.

అయితే అప్పుల భారం, కేంద్ర గ్రాంట్లలో మార్పులు, పెరుగుతున్న ఆర్థిక బాధ్యతలను రాష్ట్రాలు జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఆదాయ వనరులను పెంచుకుంటూ అనవసర ఖర్చులను నియంత్రించడం కీలకం.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నాట్ బ్యాడ్! అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడుతూనే అప్పుల నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నది ఆర్బీఐ నివేదిక సారాంశం.

2025-26లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper