India Development : భారత 80వ స్వాతంత్య్ర వేడుకలు ముగిశాయి. 81వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఇన్నేళ్లయినా దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. మూడు దశాబ్దాల క్రితం మనతో సమానంగా ఉన్న చైనా అభివృద్ధిలో అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక భారత్ కూడా గడిచిన దశాబ్ద కాలంగా అభివృద్ధిలో వేగం పుంచుకుంది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగింది. అయితే రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో ప్రగతిని పరుగులు పెట్టించాలాని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించారు. ఈమేరకు 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఇందులో సప్తధార పేరుతో కొత్త వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించారు. గ్లోబల్ పోటీలో నిలదొక్కుకుంటూ దశాబ్దాల అభివృద్ధిని కొద్ది సంవత్సరాల్లోనే సాధించాలనే ఆశయంతో రూపొందిన ఏకీకృత విధానం ఇది. తయారీ పరిశ్రమ, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, ఏఐ, డీప్‌టెక్, డిఫెన్స్, కనెక్టివిటీ, గ్రీన్, బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
సప్తధారలోని ఈ ఏడు రంగాలే ఎందుకు?
తయారీ పరిశ్రమను బలోపేతం చేయడం ద్వారా ఉపాధి సృష్టి, విలువ జోడింపు, ఎగుమతుల పెరుగుదల సాధ్యమవుతుంది. వ్యవసాయంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడం రైతుల ఆదాయం పెంచడంతోపాటు వ్యర్థాలను తగ్గించాలని భావిస్తున్నారు. ఇక ఏఐ, డీప్‌టెక్ వంటి అధునాతన సాంకేతిక రంగాలు భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు పునాది. డిఫెన్స్ రంగంలో స్వావలంబన సాధించడం జాతీయ భద్రతతోపాటు ఎగుమతి అవకాశాలను కూడా తెస్తుంది. కనెక్టివిటీ అభివృద్ధి దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించి వ్యాపారం, పర్యాటనం, సరఫరా చైన్‌ను బలోపేతం చేస్తుంది. గ్రీన్, బ్లూ ఎకానమీపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రకృతి వనరులు, తీరప్రాంతాలు, నీలి ఆర్థిక వ్యవస్థ ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధించాలనే వ్యూహం ఉంది. సాఫ్ట్ పవర్ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంస్కృతి, విద్యా విలువలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి భారత బ్రాండ్‌ను బలోపేతం చేయాలనే కేంద్రం ఆలోచన. ఈ ఏడు రంగాలు కలిసి భారత్‌ను కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాకుండా సాంస్కృతిక, సాంకేతిక, వ్యూహాత్మక శక్తిగా నిలబెట్టే అవకాశం కల్పిస్తాయి.
5 నుంచి 7 ఏళ్లలో దశాబ్దాల అభివృద్ధి
ప్రధాని మోదీ చెప్పినట్లు, ఇప్పటి వరకు దశాబ్దాలు పట్టిన అభివృద్ధిని ఈ సప్తధార వ్యూహం ద్వారా 5 నుంచి 7 సంవత్సరాల్లోనే సాధించవచ్చని అంచనా. ఎందుకంటే ఈ ఏడు రంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఏఐ, డీప్‌టెక్ తయారీ, వ్యవసాయం, డిఫెన్స్‌లో సామర్థ్యం పెంచుతుంది. కనెక్టివిటీ గ్రీన్, బ్లూ ఎకానమీ, ఫుడ్ ప్రాసెసింగ్‌కు మార్కెట్లను తెరుస్తుంది. సాఫ్ట్ పవర్ భారత ఉత్పత్తులు, సేవలకు ప్రపంచ ఆమోదం పెంచుతుంది. ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ఒక రంగంపై ఆధారపడితే సరిపోదు. బహుముఖ వ్యూహం అవసరం. సప్తధార ఈ అవసరాన్ని తీర్చేలా రూపొందింది కేంద్రం. ముఖ్యంగా పర్యావరణ సుస్థిరతను ఆర్థిక వృద్ధితో కలపడం ఆధునిక వ్యూహంలో భాగం.
అమలులో సవాళ్లు..
ఈ ప్రణాళిక విజయవంతం కావాలంటే కేవలం ప్రకటన సరిపోదు. రాష్ట్రాల సహకారం, ప్రైవేట్ రంగం పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, నియంత్రణ సంస్కరణలు అవసరం. గ్రీన్, బ్లూ ఎకానమీలో స్థానిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, సాఫ్ట్ పవర్‌ను కేవలం ప్రచారం కాకుండా ఆర్థిక లబ్ధిగా మార్చడం ముఖ్యం. అయితే ఈ ఏడు రంగాలపై సమన్వయంతో పని జరిగితే భారత్ ప్రపంచ వ్యాపార, సాంకేతిక, సాంస్కృతిక మ్యాప్‌లో తన స్థానాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది.
సప్తధార కేవలం అభివృద్ధి ప్రణాళిక కాదు. ఇది భారత్‌ను ఆత్మనిర్భరంగా, పోటీతత్వంతో, స్థిరంగా ముందుకు తీసుకెళ్లే దారి. విజయం అమలు వేగం, సమన్వయం, నిరంతర పర్యవేక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యూహం సరిగా అమలైతే ‘వికసిత్ భారత్’ లక్ష్యం వాస్తవరూపం దాలుస్తుంది.