వృద్ధుల జనాభా పెరుగుతున్న రాష్ట్రాలు ఒకవైపు.. యువతరం అధికంగా ఉన్న రాష్ట్రాలు మరోవైపు.. మధ్యస్థంగా ఉన్న రాష్ట్రాలు ఇంకోవైపు! దేశంలోని రాష్ట్రాల భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ఈ వర్గీకరణ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఒక రాష్ట్రం ఆర్థికంగా ఎంత బలంగా ఉంది? అక్కడ ఆదాయం ఎంత వస్తోంది? అప్పులు ఎంత ఉన్నాయి? అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? సాధారణంగా రాష్ట్రాల బడ్జెట్‌ను విశ్లేషించేటప్పుడు ఇలాంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే రాష్ట్రాల ఆర్థిక భవిష్యత్తును అంచనా వేయాలంటే జనాభా స్వరూపాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
దేశంలోని రాష్ట్రాలను జనాభా వయో నిర్మాణం ఆధారంగా మూడు రకాలుగా విభజించడం వెనుక కూడా ఇదే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుతం యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, వృద్ధుల జనాభా పెరుగుతున్న రాష్ట్రాలకు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు ఒకేలా ఉండవు.
1. వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
ఒక రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 15 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాన్ని ‘ఏజింగ్ స్టేట్’గా పరిగణించారు.
ఆర్బీఐ అంచనాల ప్రకారం 2026 నాటికి ఈ కేటగిరీలోకి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చేరాయి.
– కేరళ: 60 ఏళ్లు పైబడిన జనాభా 18.7 శాతం.
– తమిళనాడు: 60 ఏళ్లు పైబడిన జనాభా 15.8 శాతం.
వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలపై ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలు, పెన్షన్లు, సామాజిక భద్రత పథకాల ఖర్చు పెరుగుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులో ఉన్న జనాభా వాటా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం పడొచ్చు.
అందుకే ఇలాంటి రాష్ట్రాలు భవిష్యత్తులో వైద్య రంగం, వృద్ధుల సంక్షేమం, పెన్షన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆర్బీఐ సూచిస్తోంది.
2. మధ్యస్థ జనాభా కలిగిన రాష్ట్రాలు
60 ఏళ్లు పైబడిన వారి జనాభా 10 శాతం నుంచి 15 శాతం లోపు ఉన్న రాష్ట్రాలను ‘ఇంటర్మీడియట్ స్టేట్స్’గా విభజించారు. ఈ కేటగిరీలో మొత్తం 14 రాష్ట్రాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఈ వర్గంలో ఉన్నాయి.
ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం యువత, మధ్య వయస్కులు, వృద్ధుల మధ్య జనాభా సమతుల్యత ఉన్నప్పటికీ.. రానున్న పదేళ్లలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి నుంచే ఆరోగ్య రంగం, పెన్షన్లు, ఉద్యోగ కల్పన, ఆర్థిక వనరుల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
3. యువ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు
60 ఏళ్లు పైబడిన వారి జనాభా 10 శాతం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలను ‘యూత్‌ఫుల్ స్టేట్స్’గా పరిగణించారు.
ఈ కేటగిరీలో రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ రాష్ట్రాల్లో యువత, పని చేసే వయసులో ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. సరైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ రాష్ట్రాలు దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా మారతాయి.
అయితే యువ జనాభా ఎక్కువగా ఉండటం ఒక్కటే ఆర్థిక అభివృద్ధికి హామీ కాదు. యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ అందించడంలో ప్రభుత్వాలు విఫలమైతే అదే జనాభా ఆర్థిక భారంగా మారే ప్రమాదం కూడా ఉంది.
ఈ విభజన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఆర్బీఐ చేసిన ఈ వర్గీకరణ కేవలం జనాభా లెక్కలకు సంబంధించినది మాత్రమే కాదు. రాష్ట్రాల భవిష్యత్తు బడ్జెట్లు, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలు, అప్పులు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపే అంశం.
యువ రాష్ట్రాలకు అవకాశాలు.. వృద్ధ రాష్ట్రాలకు ఆర్థిక సవాళ్లు!
యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఉత్పత్తి, వినియోగం, పన్నుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందుకోసం ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి కల్పనపై పెట్టుబడులు పెట్టాలి.
మధ్యస్థ రాష్ట్రాలకు మరో రకమైన సవాలు ఉంది. ప్రస్తుతం వారి వద్ద జనాభా పరంగా అవకాశాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
ఇక వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. పెన్షన్లు, వైద్య సేవలు, వృద్ధుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాల్సి వస్తుంది. అదే సమయంలో పనిచేసే జనాభా తగ్గితే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై ఒత్తిడి పెరగవచ్చు.
ఆర్బీఐ నివేదిక మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2026లో మధ్యస్థ కేటగిరీలో ఉన్న రాష్ట్రాల్లో దాదాపు సగం 2031 నాటికి వృద్ధ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలోకి వెళ్లనున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2036 నాటికి ఆ కేటగిరీలోకి చేరే అవకాశముంది. అంటే జనాభా మార్పులు రాష్ట్రాల ఆర్థిక విధానాలను క్రమంగా మార్చబోతున్నాయి.
తెలంగాణకు ఈ నివేదిక ఇచ్చే సంకేతాలేంటి?
ఈ వర్గీకరణలో తెలంగాణ ప్రస్తుతం మధ్యస్థ రాష్ట్రాల జాబితాలో ఉంది. 2026 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి వాటా 12.5 శాతంగా ఉంది. అయితే 2031 నాటికి ఇది 14.5 శాతానికి, 2036 నాటికి 17.1 శాతానికి చేరుతుందని అంచనా.
అంటే తెలంగాణ కూడా రానున్న కాలంలో వృద్ధ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, వృద్ధుల సంక్షేమం, పెన్షన్ విధానాలు, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రాల ఆర్థిక విధానాలు మారాల్సిన సమయం వచ్చిందా?
ఒకప్పుడు రాష్ట్రాల ఆర్థిక బలాన్ని జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం, అప్పులు, బడ్జెట్ లోటు వంటి అంశాల ఆధారంగా అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు జనాభా వయో నిర్మాణం కూడా అంతే కీలకంగా మారుతోంది.
యువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఆ అవకాశాన్ని ఆర్థిక శక్తిగా మార్చుకోవాలి. మధ్యస్థ రాష్ట్రాలు భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలి. వృద్ధుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు సామాజిక భద్రతకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి.
అందుకే రాష్ట్రాల ఆర్థిక విధానాలు ఒకే మూసలో ఉండకూడదు. ఏ రాష్ట్రంలో ఎలాంటి జనాభా ఉంది? భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు ఏర్పడతాయి? అనే అంశాలను బట్టి బడ్జెట్ రూపకల్పన జరగాలి.
దేశం మొత్తం రాష్ట్రాల్ని రిజర్వు బ్యాంకు మూడు రకాలుగా ఎందుకు విభజించింది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.