Election Commissioners : భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘానికి ఉన్న స్థానం అత్యంత కీలకం. అధికార పార్టీ ఎవరు? ప్రతిపక్షం ఎవరు? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్నది రాజకీయ ప్రక్రియ నిర్ణయిస్తుంది. కానీ ఆ ప్రక్రియకు న్యాయనిర్ణేతగా నిలిచే సంస్థపై ప్రజలకు అనుమానం కలిగితే.. సమస్య రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసానికే సంబంధించిన ప్రశ్నగా మారుతుంది.
ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23న ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మధ్య గత పది నెలల్లో చోటుచేసుకున్న అంతర్గత వ్యవహారాలను ఆ కథనం బయటపెట్టింది. కథనం ప్రకారం.. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కనీసం 14 సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఇది కేవలం ‘అభిప్రాయ భేదాలు’గా కొట్టిపారేయగల విషయమేనా? అదే ఇప్పుడు అసలు ప్రశ్న.
కొత్త ఓటర్ల విషయంలో ఏమైంది?
మొదటగా ఫారం-6లో చేసిన మార్పు కీలకమైన అంశం. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వ్యక్తులు సమర్పించే ఫారం-6లో గతంలో లేని విధంగా పాత 2002 SIR ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రులు/తాతముత్తాతల పేర్లు ఉన్నాయా అనే అంశాన్ని చేర్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ముఖ్యంగా నిబంధనలను మార్చకుండా ఈ విధంగా ఫారంలో మార్పు చేయడం ‘అనధికారికం, చట్టవిరుద్ధం’ అని సంధు అభిప్రాయపడినట్లు రిపోర్ట్ చేసింది.
ఇక్కడ అసలు సమస్య ఒక ఫారం మారిందా లేదా అన్నది కాదు. ఓటు హక్కు పొందే ప్రక్రియలో మార్పులు ఎవరి నిర్ణయంతో జరుగుతున్నాయి? వాటికి చట్టపరమైన ఆధారం ఏమిటి? సంబంధిత కమిషనర్లందరి అనుమతి ఉందా? అన్నది.
ఓటర్ల జాబితా ఎవరి నియంత్రణలో?
ఇంకో తీవ్రమైన అంశం ఎన్నికల డేటా, సాఫ్ట్‌వేర్ నియంత్రణకు సంబంధించినది. సాంప్రదాయంగా ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియలో నియోజకవర్గ స్థాయిలోని Electoral Registration Officers (EROలు) కీలక పాత్ర పోషిస్తారు. అయితే డిజిటల్ వ్యవస్థల కేంద్రీకరణతో వారి అధికారాలు పరిమితం అవుతున్నాయా? అన్న సందేహాన్ని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసినట్లు రిపోర్ట్ చెబుతోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. ఓటర్ల డేటాబేస్‌కు సంబంధించిన ఐటీ వ్యవస్థను ఢిల్లీ కేంద్రంగా కేంద్రీకరించడం, క్షేత్రస్థాయి అధికారుల నిర్ణయాలను సాఫ్ట్‌వేర్ పరిమితులు ప్రభావితం చేయడం వంటి అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గోవాలో 97 మంది ఓటర్ల విషయంలో సాఫ్ట్‌వేర్ కారణంగా స్థానిక EROలు తీసుకున్న నిర్ణయాలను నమోదు చేయలేకపోయిన ఘటనను కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావించారు. 97 అనేది సంఖ్యాపరంగా చిన్నదే కావచ్చు. కానీ ఒక ఓటరుకు అర్హత ఉందని క్షేత్రస్థాయి అధికారి నిర్ణయించిన తర్వాత కూడా సాఫ్ట్‌వేర్ ఆ నిర్ణయాన్ని అమలు చేయనివ్వకపోతే.. ప్రశ్న ఆ 97 మందితో ముగియదు.
‘ఓటు హక్కు’ను నిర్ణయించేది చట్టమా? అధికారియా? లేక సాఫ్ట్‌వేర్‌నా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంపై ఈసీ స్పందిస్తూ.. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ పూర్తి కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలేనని స్పష్టం చేసింది. అంతర్గత చర్చల్లో భిన్నాభిప్రాయాలు, సూచనలు సాధారణమేనని పేర్కొంది. కొన్ని అంతర్గత నోట్స్‌ను మాత్రమే చూపించి మొత్తం వ్యవస్థపై ఒకే రకమైన చిత్రాన్ని రూపొందించడం సరైంది కాదని ఈసీ అభిప్రాయపడింది. అలాగే దాదాపు 40 కొత్త ఎన్నికల సంస్కరణలు చేపట్టామని పేర్కొంది.
ఇప్పటి పరిణామాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే కాదు. దేశ ఎన్నికల వ్యవస్థలో నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? ఓటర్ల జాబితాను ఎవరు నియంత్రిస్తున్నారు? ఒక రాజ్యాంగ సంస్థలో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఎలా పరిష్కరించబడుతున్నాయి? అన్నదే అసలు ప్రశ్న.
ఎన్నికల కమిషనర్ల వి అభిప్రాయ భేదాలు కావు తీవ్ర ఆరోపణలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.