Rahul Gandhi: నరేంద్ర మోడీ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాడు. ముమ్మాటికి ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్ (వీటిని దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ) లను రద్దు చేయాల్సిందే. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాల్సిందే.. ఈసారి నరేంద్ర మోడీ అయినా.. ఆయన బాబు అయినా వెళ్లిపోవాల్సిందే.. ఎన్నికల కమిషనర్ రిజైన్ చేయాల్సిందే.. ఇలానే ఉంటున్నాయి కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ.. మల్లికార్జున కార్గే మాటలు.
రాహుల్ గాంధీ కోరుకున్నట్టుగానే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ విధానంలోనే అక్కడ పోలింగ్ ప్రక్రియ జరిగింది. కానీ ఏమైంది.. రాహుల్ గాంధీ కోరుకున్నట్టుగా హస్తవాసి మారలేదు. చేతిరాత కొత్తగా నమోదు కాలేదు. పైగా రూలింగ్ లో ఉన్న కన్నడ సీమలో హస్తానికి గుండు సున్నా మిగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కి రిక్త హస్తం మిగిలింది. నాలుగు స్థానాలలో కమలం తీన్ మార్ డ్యాన్స్ వేసింది.. కమలానికి దగ్గరి దోస్తు జెడిఎస్ కు ఒక స్థానం వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో మాత్రం అక్కడి అఖిలేష్ యాదవ్ కు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఒకరకంగా కమలం అగ్ర నాయకులు దీనిని అంత తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు ఇది. కమలానికి అక్కడ తిరుగులేదు.. బుల్డోజర్ నాయకత్వానికి అడ్డులేదు అనుకుంటున్న క్రమంలో ఇలాంటి ఫలితాలు రావడం ఒక రకంగా ఆశ్చర్యమే. ఇక దేశంలో ఇతర సెగ్మెంట్లకు జరిగిన పోలింగ్ లో.. కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు అంచనా వేసినట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయి. మిషన్లు వద్దు.. పేపర్లే ముద్దు అంటున్నవారు.. ఈ ఫలితాలు చూసి ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి నాయకత్వం మార్పును ప్రజలు కోరుకుంటే.. కచ్చితంగా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ జనాలను రూలింగ్ చేయాలని అనే ఆలోచన మాత్రమే ఉంటే..వచ్చే రిజల్ట్ ఇదిగో ఇలానే ఉంటుంది.
ఇప్పటికైనా రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. బలవంతపు ఉద్యమాలు.. సోషల్ మీడియా స్టార్లతో ప్రజలు ప్రభావితం కాలేరు. సెర్బియాలో అవినీతి పెరిగిపోయింది. శ్రీలంకలో రాజరికం ఎక్కువైపోయింది. నేపాల్ లో జవాబుదారితనం లోపించింది. బంగ్లాదేశ్లో గ్రీవెన్స్ తప్పుదారి పట్టింది. ఇవన్నీ కూడా అక్కడ ఉద్యమాలకు కారణమయ్యాయి. కానీ భారతదేశంలో అలా లేదు. ఆ విధంగా జరగాలని హస్తం పార్టీ కీలక నాయకుడు కోరుకుంటే.. ఫలితాలు ఆయన అనుకున్నట్టు కాకుండా.. సున్నా రూపంలో వస్తుంటాయి. ఈ ఫలితాలు బీజేపీకి బూస్ట్ ఇస్తాయి. ఇప్పుడు ఆ పార్టీకి అది తక్షణావసరం.