Telangana Liquor : మిగతా వాటి విషయంలో ఎలా ఉంటారో తెలియదు కానీ.. తాగే బ్రాండ్ల విషయంలో మందుబాబులు ఒక క్లారిటీతో ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నచ్చిన బ్రాండ్ తాగితేనే కిక్. లేకపోతే వారి కోపం తారస్థాయికి చేరుతుంది. తిక్క రేగితే ప్రభుత్వాన్ని కూడా మార్చగలరు. ఎందుకంటే వాళ్లకు తాగే విషయంలో.. తాగే మందు కిక్కు ఎక్కించే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు.
అప్పట్లో జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు తిక్క తిక్క బ్రాండ్లు మొత్తం మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ చెత్త బ్రాండ్ల మందు తాగలేక.. ఇతర బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చే అవకాశం లేక మందు బాబులు పడ్డ ఇబ్బందులు మామూలువి కావు. ఆంధ్ర సరిహద్దులో ఉండే తెలంగాణ ప్రాంతాల నుంచి మందుబాబులు మందు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. అయితే ఈ వ్యవహారానికి అడ్డు కట్టడానికి ఏపీ పోలీసులు ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసే వారంటే.. నాడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి వారు కోరుకున్న బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో నాటి టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు చెప్పారు అంటే.. మందుబాబులు బ్రాండ్లకు ఇచ్చే విలువ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మద్యం వినియోగంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కూడా మద్యం వినియోగం అధికంగా ఉంది. ఒకప్పుడు అకేషనల్ గా మాత్రమే చాలామంది తాగేవారు. ఇప్పుడు ఒక అలవాటుగా తాగడాన్ని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో తెలంగాణ మార్కెట్లోకి చీతా.. టైగర్.. రెడ్ హార్స్ వంటి బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మార్కెట్లో ఏకంగా 121 కొత్త మద్యం బ్రాండ్లను తీసుకురావడానికి ఎక్సైజ్ శాఖకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 18 కంపెనీలు ఈ దరఖాస్తులు సమర్పించాయి. ఈ బ్రాండ్ల సరఫరాకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఇక కొత్త బ్రాండ్ల జాబితాలో ఆ బెస్ట్.. బర్గర్.. టైగర్.. రెడ్ హార్స్.. బుటానిస్.. సీయోక్ బింగో.. కాకావిస్.. డాన్ గ్లాంగ్ వంటి బీర్లతోపాటు.. విస్కీ.. బ్రాందీ వంటి వాటిలో కూడా మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం సిండికేట్ వల్ల చాలా ప్రాంతాలలో కొన్ని కంపెనీలకు సంబంధించిన బీర్లు.. విస్కీ.. బ్రాందీ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్లు అందుబాటులోకి వస్తే మందుబాబులు ఏ విధంగా స్వీకరిస్తారనేది చూడాల్సి ఉంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు బ్రాండ్లకు విపరీతమైన ప్రియారిటి ఇస్తారు. ఆమధ్య తమ కోరుకున్న బ్రాండ్ బీర్లు అందుబాటులో లేవని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో మద్యం షాపులు ఎదుట మందుబాబులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త బ్రాండ్లను తీసుకువచ్చి మందుబాబుల ఆగ్రహానికి ప్రభుత్వం గనుక గురైతే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అందువల్లే బ్రాండ్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.